
ట్యాంకర్ల డెలివరీ టైమింగ్ తగ్గించాలి
సాక్షి, సిటీబ్యూరో: ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలు అందించాలని ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం మాదాపూర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. వేసవిలో నీటి డిమాండ్‌ను ఎదుర్కోవడానికి అధికారులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ట్యాంకర్ బుక్ చేసిన వెంటనే డెలివరీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం సూక్ష్మ స్థాయి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అవసరమైతే అదనపు ట్యాంకర్లు, సిబ్బందిని సమకూర్చుకోవాలని చెప్పారు. మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఏమైనా అవసరాలుంటే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వాటిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
ట్యాంకర్ల సరఫరాపై ఆరా
ట్యాంకర్ డ్రైవర్లతో ఎండీ మాట్లాడారు. ట్యాంకర్ బుకింగ్, డెలివరీ లాగ్ బుక్‌ను పరిశీలించారు. ట్యాంకర్ బుకింగ్ స్టేటస్, రోజుకి ఎన్ని ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి? ఎన్ని డెలివరీ చేస్తున్నారు? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాదాపూర్ ఫిల్లింగ్ స్టేషన్ లో 06 ఫిల్లింగ్ పాయింట్స్, 80 ట్యాంకర్లు ఉండగా.. రోజుకి 600 ట్రిప్పులు డెలివరీ చేస్తున్నారు. 80 శాతం బుకింగ్స్ ను 6 నుంచి 12 గంటల్లో డెలివరీ చేస్తుండగా.. మిగిలిన 20 శాతం 24 గంటల్లో డెలివరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 600 ట్రిప్పులు డెలివరీ చేస్తుండగా.. రాబోయే రోజుల్లో 1200 బుకింగ్స్ వచ్చినా డెలివరి చేసే సామర్థ్యం ఉందని జీఎం.. ఎండీ కి వివరించారు.ఈ కార్యక్రమంలో జీఎం, డీజీఎం, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
ఈడీ ఇన్‌స్పెక్షన్..
జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్ ఆదివారం పలు ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. షాపూర్‌నగర్, మౌలాలి, ఎల్లారెడ్డి గూడ ఫిల్లింగ్ స్టేషన్లకు వెళ్లారు. ట్యాంకర్ బుకింగ్ స్టేటస్, రోజుకి ఎన్ని ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి? ఎన్ని డెలివరీ చేస్తున్నారు? తదితర వివరాలు తనిఖీ చేశారు. ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ ఇన్‌చార్జిలతో మాట్లాడి వివరాలు కనుక్కున్నారు.
నీటి సరఫరాలో అంతరాయం
మసీద్ బండ సెక్షన్‌లో విద్యుత్ శాఖ నిర్వహణ పనులు చేపడుతోంది. దీంతో ఆ సెక్షన్ పరిధిలో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చెయ్యడం ఆగింది. ఒకే ఫిల్లింగ్ స్టేషన్ తో (గ్రావిటీ ద్వారా నడిచే) నీటి సరఫరా చేస్తున్నారు.
మాదాపూర్ ఫిల్లింగ్ స్టేషన్‌లో జలమండలి ఎండీ తనిఖీ
జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
మాదాపూర్ ఫిల్లింగ్ స్టేషన్ తనిఖీ