
విధులకు గైర్హాజరైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు
ప్రొఫెసర్లు, అసోసియేట్లకు షోకాజ్ నోటీసులు
వైద్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని, పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన గాంధీ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అవుట్ పేషెంట్ విభాగాలన్నింటా కలియతిరిగారు. రోగులు, రోగి సహాయకులతో మాట్లాడారు. వైద్య సేవలు, సమస్యలు, సౌకర్యాలపై ఆరా తీశారు. డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించుకుని పరిశీలించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పలువురు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు చేపట్టాలని, షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరాలని అక్కడే ఉన్న డీఎంఈ, గాంధీ సూపరింటెండెంట్‌లకు ఆదేశించారు.
అసలేం జరుగుతోంది?
నర్సింగ్ సిబ్బంది అటెండెన్స్ రిజస్టర్ అందుబాటులో లేకపోవడంతో విస్మయం వ్యక్తం చేశారు. గాంధీ ఆస్పత్రిలో ఏం జరుగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేడియాలజీ విభాగంలోని ఎక్స్‌రే, ఎమ్మారై, సీటీస్కాన్ తదితర వార్డులు, రెండో అంతస్తులోని జనరల్ మెడిసిన్ ఇన్‌పేషెంట్ వార్డును పరిశీలించారు. అనంతరం మాతాశిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లోని సంతాన సాఫల్య కేంద్రాన్ని (ఐవీఎఫ్ ) సందర్శించారు. ఇప్పటి వరకు ఎంతమందికి సేవలు అందించారు, సక్సెస్ రేట్ ఎంత, ప్రస్తుతం ఎంత మంది ఉన్నారు, విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, సిబ్బంది సంఖ్య ఎంత అంటూ ఆరా తీయగా.. ఒక్కదానికి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఐవీఎఫ్ సెంటర్‌కు సంబంధించిన వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఎంఈని ఆదేశించారు.
సీరియస్‌గా రివ్యూ చేయాలి..
గాంధీ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలపై సీరియస్‌గా రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని మంత్రి రాజనర్సింహ అభిప్రాయపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గాంధీలో కొనసాగుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మెడికల్, నాన్ మెడికల్ ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. గాంధీలో సమస్యలు, లోపాలపై వారం రోజుల్లో రివ్యూ సమావేశం నిర్వహిస్తానని వివరించారు.
చీటీపై రాసిస్తే చిటికెలో పరిష్కారం!
గాంధీభవన్‌కు వచ్చి నీ సమస్యను చీటీపై రాసిస్తే చిటికెలో పరిష్కారం దొరుకుతుందని ఓ దివ్యాంగురాలికి మంత్రి దామోదర్ రాజనర్సింహ భరోసా ఇచ్చారు. మంగళవారం గాంధీఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసి తిరిగి వెళ్తున్న క్రమంలో దివ్యాంగ వృద్ధురాలు రాజనర్సింహను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. సదరం సర్టిఫికెట్ కోసం ఏళ్ల తరబడిగా తెలంగాణ భవన్ చుట్టూ తిరిగినా ఫలి తం లేకుండాపోయిందని, ప్రస్తుతం తనకు సదరం ధ్రువీకరణ పత్రం ఇప్పించాలని వేడుకుంది. తెలంగాణ భవన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని.. ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, గాంధీ భవన్‌కు వచ్చి చీటీపై రాసిస్తే సమస్యకు చిటికెలో పరిష్కా రం దొరకుతుందని మంత్రి ఆమెకు వివరించారు. ఓపీ చీటీపై తన ఫోన్ నంబరు రాసి ఇచ్చారు. ఫోన్ చేసి తన క్యాంపు కార్యాలయానికి వస్తే సమస్యను పరిష్కరిస్తానన్నారు. ఆమె వివరాలు అడిగి తెలుసుకుని కొంత నగదు ఆర్థిక సాయంగా అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు మంత్రి రాజనర్సింహ.