174 మంది జూనియర్ అసిస్టెంట్లకు పోస్టింగులు
సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో 174 మంది జూనియర్ అసిస్టెంట్లకు సోమవారం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పోస్టింగ్ ఆర్డర్లను అందజేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 4 ఉద్యోగాల రిక్రూట్‌మెంట్‌లో భాగంగా జీహెచ్‌ఎంసీకి కేటాయించిన వారిలో రిపోర్టు చేసిన 174 మందికి పోస్టింగ్ ఆర్డర్స్ అందజేశారు. వారిని ప్రధాన కార్యాలయంతోపాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని రిలాక్స్ కావద్దని, ప్రతి ఉద్యోగి బాధ్యతగా, అంకితభావంతో పనిచేసి కార్పొరేషన్‌కు మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రమశిక్షణతో పనిచేసి ప్రజలకు మంచి సేవలు అందించినప్పుడే ఉద్యోగికి గుర్తింపుతో పాటు మరింత ఉన్నతంగా రాణిస్తారన్నారు. నగరంలో హెల్త్, శానిటేషన్ నిర్వహణ బాగుండాలని, ఆ విషయంలో ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పరిపాలన విభాగం అడిషనల్ కమిషనర్ వేణుగోపాల్, జాయింట్ కమిషనర్ శ్రీనివాస్,ఏఎంసీ జీవన్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.