ఫ్లాగ్ డే ఫండ్‌కు ఎస్‌బీఐ భారీ విరాళం
సాక్షి, సిటీబ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని హైదరాబాద్ సర్కిల్ ఉద్యోగులు తెలంగాణ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి రూ. 37.16 లక్షలు విరాళంగా అందించి తమ దాతృత్వాన్ని, సామాజిక బాధ్యత పట్ల నిబద్ధతను ప్రదర్శించారు. ఇందులో భాగంగా ఎస్‌బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి చైర్‌పర్సన్, తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు రూ. 37,16,500 విలువైన చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ (తెలంగాణ) డైరెక్టర్ కల్నల్ రమేష్ కుమార్, జితేంద్ర కుమార్ శర్మ డీజీఎం, సీఎస్‌ఓ కెప్టెన్ సంజయ్ అపగే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎస్‌బీఐ సిబ్బంది సామాజిక చొరవను అభినందించారు.
నగరానికి నిధుల కేటాయింపు అంతంతే..
– అసెంబ్లీలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం నుంచి రాష్ట్ర ఖాజానాకు సింహభాగం ఆదాయం వచ్చి చేరుతున్నా..బడ్జెట్‌లో నిధుల కేటాయింపు మాత్రం మొక్కుబడిగా ఉందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీ, జలమండలికి, ఇతర సంస్థలకు నామమాత్రంగా నిధులు కేటాయించారని గుర్తు చేశారు. వాటర్‌బోర్డుకు కేవలం రూ. 3,383 కోట్ల కేటాయించారని, అందులో 3,083 కోట్ల అప్పుల చెల్లింపు, ఉచిత నీటి రియింబర్స్‌మెంట్ కింద రూ.300 కోట్ల కేటాయించారని గుర్తు చేశారు. అభివృద్ధి పనులుకు ఏ మాత్రం కేటాయించలేదని పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగు కోసం తక్షణమే రూ. 1500 కోట్ల కేటాయించాలన్నారు. జీహెచ్‌ఎంసీకి నిధులు కేటాయిపు పెంచాలన్నారు. నగర అభివృద్ధికి పెద్దపీట వేయాలన్నారు. విద్యారంగ సమస్యలు తక్షణమే పరిష్కారించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు మంజూరు చేయాలని రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.