జవహర్‌నగర్: వేడి నీటి బకెట్‌లో పడిన బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన ఘటన జవహర్‌నగర్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ కార్పొరేషన్ మార్కెట్ లైన్‌లో కాటి నర్సింహ, సుమలత దంపతులు ఇద్దరు కుమారులతో ఉంటున్నారు. నర్సింహ కూలిపనులు చేస్తుంటాడు. ఇద్దరు పిల్లలను చూసుకునేందుకు సుమలత తల్లి పుల్లమ్మ నర్సింహ ఇంటికి వచ్చింది. ఈ నెల 23న పుల్లమ్మ సమీపంలోని బంధువుల ఇంటికి నర్సింహ, సుమలతల చిన్న కుమారుడు బన్నీ(4)ని తీసుకుని వెళ్లింది. అప్పటికే ఆ ఇంట్లో హీటర్‌తో వేడి చేసిన నీటిని పెట్టి అక్కడే ఉంచారు. ఆ సమయంలో అక్కడే ఆడుకుంటున్న బన్నీ వేడి నీటి బకెట్‌లో పడిపోవడంతో ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం బాలుడు మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి బన్నీ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.