పటిష్టంగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్
● వేసవిలో అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా చర్యలు
● సమన్వయ సమావేశంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా కమిషనర్లు
సాక్షి, సిటీబ్యూరో: రానున్న వర్షాకాలంలో నగరంలో ప్రజల కష్టాలను తొలగించే విధంగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఫైర్ సేఫ్టీ, మాన్సూన్ యాక్షన్ ప్లాన్, నాలాల్లో పూడికతీత, నాలాల వద్ద భద్రత ఏర్పాట్లు, చెరువుల పునరుద్ధరణ అంశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో ఎదురయ్యే పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నగరంలో గుర్తించిన 141 నీటి నిల్వ ప్రాంతాల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. భవిష్యత్తులో నీటి నిల్వ ప్రాంతాలు లేకుండా శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో సమస్యలకు ఆస్కారం లేకుండా పూడికతీత పనులు వర్షాకాలం లోపు పూర్తి చేయాలని సూచించారు. ప్రజల భద్రతకు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో సమష్టిగా పని చేయాలని పేర్కొన్నారు.
చెరువులపై దృష్టి సారించాలి..
నగరంలోని చెరువుల సంరక్షణ, పునరుద్ధరణలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వర్షాలప్పుడు నీరు పొంగిపొర్లకుండా నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని లేక్స్ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల వారిని ఎప్పడికప్పుడు అప్రమత్తం చేయాలని, నాలాల్లో ప్రమాదాలు సంభవించకుండా నాలా ఆడిట్ చర్యలు తీసుకోవాలని, ఆ పనులకు సర్కిల్‌కు ఒక ప్రత్యేక అధికారిని బాధ్యులను చేయాలని ఇలంబర్తి సూచించారు.
అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాలి
వేసవిలో అగ్ని ప్రమాదాలు నివారించేందుకు నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని రంగనాథ్ సూచించారు. నివాస, వాణిజ్య భవన యజమానులు, నిర్వాహకులకు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలతో అవగాహన కల్పించాలని చెప్పారు.