ఓహెచ్ లైన్ల స్థానంలో ఇక యూజీ కేబుళ్లు
జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యుత్ నెట్‌వర్క్ ఇలా..
33/11కేవీ సబ్‌స్టేషన్లు 498
33కేవీ యూజీ కేబుల్ 1,280 కి.మీ
33కేవీ ఓవర్‌హెడ్ లైన్స్ 3,725 కి.మీ
11 కేవీ ఓవర్‌హెడ్ లైన్స్ 21,643 కి.మీ
పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు 1,022
11కేవీ యూజీ కేబుల్ 957
డీటీఆర్‌లు 1,50,992
ఇంటర్మీడియట్ స్తంభాలు 58,271
● ఆసక్తిగల ఏజెన్సీల నుంచి డీపీఆర్‌ల ఆహ్వానం
● గ్రేటర్‌లో 900 కిలోమీటర్ల ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్లు
● అండర్ గ్రౌండ్ కేబుల్స్‌కు రూ.520 కోట్లు అవసరం
● డిస్కంకు నేడు డీపీఆర్‌లు సమర్పించనున్న ఏజెన్సీలు
సాక్షి, సిటీబ్యూరో:
ఇళ్లపై వేలాడుతూ ప్రమాదకరంగా మారిన ఓవర్‌హెడ్ (ఓహెచ్) విద్యుత్ లైన్ల స్థానంలో అండర్ గ్రౌండ్ (యూజీ) కేబుల్స్ వేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు డిలైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను తయారు చేసి సమర్పించాల్సిందిగా కోరుతూ డిస్కం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు ప్రముఖ అధ్యయన సంస్థలు ఇందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. 900 కిలోమీటర్ల ఓహెచ్ లైన్ల స్థానంలో యూజీ కేబుళ్లును వేసేందుకు రూ.520 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు అంచనా. ఆయా ఏజెన్సీలు రూపొందించిన నివేదికను శుక్రవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు సమర్పించనున్నాయి.
ఓవర్‌హెడ్ లైన్ రహిత నగరంగా..
● గ్రేటర్‌లో ప్రస్తుతం 60 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 52 లక్షలకుపైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిరోజూ గరిష్ట విద్యుత్ డిమాండ్ 60 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. వచ్చే వేసవిలో విద్యుత్ డిమాండ్ 100 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం లేకపోలేదు. పాతబస్తీ సహా ప్రధాన బస్తీల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి ఓవర్‌హెడ్ లైన్లు, ఇనుప స్తంభాలే దర్శనమిస్తున్నాయి. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ లైన్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి.
● చిన్నపాటి ఈదురుగాలితో కూడిన వర్షానికే తెగిపడుతున్నాయి. విద్యుత్ అంతరాయాలతో పాటు అనేక మంది మృత్యువాతకు కారణమవుతున్నాయి. లైన్ల కింద అనేక చోట్ల భారీ భవంతులు వెలిశాయి. ఇంటిపై దుస్తులను ఆరవేసేందుకు వెళ్లిన మహిళలు, పతంగ్‌లను ఎగరేసేందుకు వెళ్లిన పిల్లలు ఓవర్‌హెడ్ లైన్‌కు ఆనుకుని విద్యుత్ షాక్‌తో మృతి చెందుతున్న ఘటనలు సైతం విదితమే. ఓవర్‌హెడ్ లైన్ల స్థానంలో యూజీ కేబుళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించడంతో పాటు విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపర్చవచ్చని డిస్కం భావిస్తోంది. హైదరాబాద్‌ను ఓవర్‌హెడ్ లైన్ రహిత నగరంగా అంతర్జాతీయ పటంలో చూపింవచ్చని యోచిస్తోంది.
ప్రాధాన్య క్రమంలో పనులు..
● హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ప్రమాదకరంగా మారిన బహిరంగ విద్యుత్‌లైన్ల (ఓవర్‌హెడ్)ను తొలగించి, వాటిస్థానంలో అండర్ గ్రౌండ్ (యూజీ) కేబుళ్లను వేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఇప్పటికే సుమారు 900 కిలోమీటర్ల ఓవర్ హెడ్ (ఓహెచ్) లైన్లు ఉన్నట్లు గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ కేబుళ్ల ఏర్పాటుకు రూ.520 కోట్లకు పైగా ఖర్చు కానుందని అంచనా వేసింది. డీపీఆర్ సమర్పించిన ఏజెన్సీలకే పనులను అప్పగించాలని యోచిస్తోంది.
● గ్రేటర్ మొత్తంగా ఒకే సమయంలో కాకుండా ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టనున్నట్లు రెండు రోజుల క్రితం అసెంబ్లీలో విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించడం తెలిసిందే. పేదలు ఎక్కువగా నివసించే నందినగర్, వారాసిగూడ, రాంనగర్, చిలకలగూడ, ఎన్టీఆర్ నగర్, ఇందిరా పార్కు, అశోక్‌నగర్, పద్మారావునగర్, గాంధీనగర్, ఖైరతాబాద్, నాంపల్లి, రాజేంద్రనగర్, బోరబండ, శ్రీరామ్‌నగర్, లెనిన్‌నగర్, మన్సూరాబాద్, నాగోలు, అడ్డగుట్ట, మెహిదీపట్నం, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారిన లైన్లను మార్చే అవకాశం ఉంది.