ప్లాట్‌ఫాంపైనే ప్రసవం
అండగా నిలిచిన ఆర్‌పీఎఫ్ మహిళా పోలీసులు
సికింద్రాబాద్: ప్లాట్‌ఫాంపై ప్రసవ వేదనకు గురవుతున్న ఓ మహిళకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు అండగా నిలిచారు. అంబులెన్స్‌ను రప్పించారు. అప్పటికే సమయం మించిపోవడంతో మహిళా కానిస్టేబుళ్ల సహాయంతో అవసరమైన ఏర్పాట్లు చేయించి సదరు మహిళ సుఖ ప్రసవం వరకు అండగా నిలిచి తమ ఉదారత్వాన్ని చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దుండిగల్‌లో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన ఇటుక బట్టీ కార్మికురాలు తబ్బా మహ్‌జీ (21) నిండు గర్భిణి. భర్తతో కలిసి జనరల్ టికెట్‌తో విశాఖపట్నం వెళ్లేందుకు మంగళవారం రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. ఆరో నంబర్ ప్లాట్‌ఫాంపై ఆగి ఉన్న విశాఖపట్నం రైలు ఎక్కేందుకు సమాయత్తమవుతున్న సమయంలో మహ్‌జీకి పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవ వేదనకు గురవుతున్న సదరు మహిళ పరిస్థితిని అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ మహేక్ గుర్తించారు. సమీపంలో బందోబస్తు విధుల్లో ఉన్న ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లను రప్పించి మహ్‌జీకి అండగా ఉంచి అంబులెన్స్‌ను రప్పించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవడంతో రైల్వేస్టేషన్‌కు చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది మహ్‌జీకి ప్రసవం చేశారు. తబ్బా మహ్‌జీ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మెరుగైన వైద్యం కోసం తల్లీబిడ్డలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment