సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ క్వాలిటీకంట్రోల్ విభాగంలో డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న ఎ.దశరథ్ ముదిరాజ్ ఫైల్స్ క్లియర్ చేయడానికి, వాటిని ఈఈకి పంపించేందుకు ఒక వ్యక్తిని రూ.20వేలు డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకొని నాంపల్లి ఏసీబీ కేసుల కోర్టులో హాజరు పరిచారు. అడ్వాన్స్‌గా అంతకు ముందే రూ. 10వేలు తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది.
కంటోన్మెంట్‌లో సీబీఐ దాడులు!
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో సీబీఐ దాడులు కలకలం సృష్టించాయి. సికింద్రాబాద్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీస్‌లో గత నెలలో సీబీఐ సోదాలు జరగడంతో ఇటు డీఈఓ కార్యాలయంతో పాటు కంటోన్మెంట్ ఉద్యోగుల్లోనూ వణుకు మొదలైంది. విశ్వసనీయ సమాచారం మేరకు రక్షణ భూముల్లో అక్రమ నిర్మాణాల అంశంతో పాటు డీఈఓ కార్యాలయ సిబ్బంది, రక్షణ భూముల కబ్జాదారుల నుంచి అక్రమ వసూళ్లపై ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ప్రాథమిక ఆధారాలతో ఫిర్యాదులు అందడంతోనే సీబీఐ అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. దీంతో సదరు ఉద్యోగి కాల్ డేటా, బ్యాంకు లావాదేవీలు, కార్యాలయ సిబ్బంది సహకారంపై కూడా ఆరాతీసినట్లు తెలుస్తోంది.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నర్సాపూర్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ లింగం కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన సాయి నిఖిల్(21), అతడి మిత్రుడు మనీశ్ ఆదివారం మెదక్‌లో జరిగిన వారి మిత్రుడి వివాహానికి హాజరయ్యారు. రాత్రి ఇంటికి తిరిగి బయలుదేరారు. నర్సాపూర్ మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా నర్సాపూర్ శివారులోని అయ్యప్ప దేవాలయం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌కు బైక్ ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న మనీశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అనంతరం మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డికి తరలించారు. బైక్‌ను అతి వేగంగా అజాగ్రత్తగా నడిపినందునే అదుపుతప్పి ప్రమాదం జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.