
మావోయిస్టులతో శాంతి చర్చలు ప్రారంభించాలి
కవాడిగూడ: ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆదివాసీల హత్యా కాండను వెంటనే నిలిపివేసి గిరిజనుల జీవించే హక్కును పరిరక్షించాలని, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలను ప్రారంభించాలని పలువురు వక్తలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో సీపీఐఎం ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఛత్తీస్‌గడ్‌లో ఆదివాసీ జాతి హననాన్ని నిలిపివేయాలని కోరుతూ ప్రజాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి , సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు జె.చలపతిరావు, గోవర్ధన్, సాధినేని వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర నాయకులు పద్మ , ప్రొఫెసర్ కాశీం, విమలక్క తదితరులు పాల్గొని ప్రసగించారు. బస్తర్ ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధం ఆదివాసీల అంతానికే తప్ప వారి సంక్షేమానికి ఏమాత్రం కాదని వారు పేర్కొన్నారు. సమాజ మనుగడలో ఆదివాసీల పాత్ర ఎంతో ముఖ్యమనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా గుర్తించాలని వారు కోరారు. మావోయిస్టులు అభివృద్ధికి నిరోధకంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రులు మాట్లాడటం సరి కాదని అన్నారు. మావోయిస్టులు ప్రాతిపాదించిన శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకొని చర్చలు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరిట వందలాది మంది ఆదివాసీలను, మావోయిస్టులను ఇష్టారాజ్యాంగా కాల్చి చంపుతున్నారని, ఈ పరిణామం దేశానికి, ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరుకు ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ప్రజా ధర్నాలో పలువురు వక్తల డిమాండ్