
ఆర్డర్ల పేరుతో అందినంత స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: నగర వ్యాపారిని ఫోన్ ద్వారా సంప్రదించి, భారీ ఆర్డర్ల పేరుతో ఎర వేసి, మోసం చేసిన కేసులో ఇద్దరు సైబర్ నేరగాళ్లను సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలో పట్టుబడిన వీరిపై దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 17 కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించామని డీసీపీ దార కవిత బుధవారం వెల్లడించారు. ఇంటర్‌నెట్ ద్వారా నగర వ్యాపారి ఫోన్ నెంబర్ సంగ్రహించిన సైబర్ నేరగాళ్లు సంప్రదించారు. ఆయన ఉత్పత్తులకు ఉత్తరాదిలో మార్కెటింగ్ చేస్తామని, భారీ ఆర్డర్లు తెస్తామంటూ నమ్మబలికారు. దీనికోసం తమ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. వీరి మాట నమ్మిన వ్యాపారి రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించారు. ఆపై వ్యాపారి ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో భారీ డిమాండ్ ఉన్నట్లు, వారి నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు సైబర్ నేరగాళ్లు నకిలీ ఈ–మెయిల్స్ సృష్టించారు. ఇవన్నీ నిజమేనని సదరు వ్యాపారి నమ్మారు. ఆ సరుకు సరఫరాకు ముందు తమకు రూ.9.5 లక్షల చెల్లించాలని చెప్పిన సైబర్ నేరగాళ్లు ఆ మొత్తం తన ఖాతాలో పడిన తర్వాత స్పందించడం మానేశారు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ కె.ప్రసాద్‌రావు నేతృత్వంలో కానిస్టేబుళ్లు జి.క్రాంతి కుమార్ రెడ్డి, ఎ.సతీష్, ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, జె.వెంకటేష్, జి.రాకేష్‌లతో కూడిన బృందం దీన్ని దర్యాప్తు చేసింది. బ్యాంకు ఖాతాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన అధికారులు ఢిల్లీలో ఓ డమ్మీ కంపెనీకి సీఈఓగా ఉన్న అమర్‌నాథ్ సింగ్, మార్కెటింగ్ హెడ్‌గా పని చేస్తున్న రణ్‌వీర్ సింగ్ బాధ్యులని తేల్చారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం వీరిని అరెస్టు చేసింది. వీరిపై మహారాష్ట్ర, పంజాబ్‌ల్లో రెండేసి, రాజస్థాన్‌లో 5, హర్యానా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ల్లో ఒక్కోటి చొప్పున కేసులు ఉన్నట్లు గుర్తించారు.
నగరవాసికి టోకరా వేసినసైబర్ నేరగాళ్లు
ఢిల్లీలో ఇద్దరిని అరెస్టు చేసినసిటీ సైబర్ కాప్స్