
ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
లింగోజిగూడ: శివారు ప్రాంతాల ఏటీఎంలే లక్ష్యంగా చేసుకోని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, కారు, వివిధ రకాల పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎల్‌బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ కమిషనర్ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. రాజస్తాన్‌లోని డీగ్ జిల్లా సందీక గ్రామానికి చెందిన రాహుల్ అలియాజ్ రాహుల్ ఖాన్, మధ్యప్రదేశ్‌లో జేసీబీ మెకానిక్‌గా పని చేస్తున్న సందీక గ్రామానికి చెందిన జాహుల్ భాదన్ ఖాన్, జల్‌పల్లి షాజహాన్ కాలనీకి చెందిన ఎండీ సర్ఫారాజ్‌లు ఓ ముఠాగా ఏర్పడి ఏటీఎంలలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గత ఫిబ్రవరి 22 నుంచి 26 రావిర్యాల, పహడీషరీఫ్, బాలాపూర్, జల్‌పల్లి, బీబీనగర్, భువనగిరి, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లోని ఏటీఎంల వద్ద రెక్కీ నిర్వహించారు. చివరకు రావిర్యాల, మైలార్‌దేవ్‌పల్లి ఏటీఎంలలో చోరీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 26న మరికొందరు స్నేహితుల సాయంతో రావిర్యాల ఎస్‌బీఐ ఏటీంలో రూ.29 లక్షల 69 వేల 900 ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి మైలార్‌దేవ్ పల్లి, మధుబాన్ కాలనీలో మరో ఎస్‌బీఐ ఏటీఎంలో చోరికి ప్రయత్నించగా మిషన్‌లో మంటలు రావడంతో అక్కడి నుంచి నాందేడ్ మహారాష్ట్ర మీదుగా పారిపోయారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాహుల్‌ఖాన్, ముస్తాఖీన్ ఖాన్, వహీద్‌ఖాన్, షకీల్ ఖాన్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, కారు, చోరీకి ఉపయోగించిన వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.