సైబర్‌ నేరగాళ్ల ‘డబుల్‌ టోకరా’! | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్ల ‘డబుల్‌ టోకరా’!

Published Wed, Apr 9 2025 7:31 AM | Last Updated on Wed, Apr 9 2025 7:31 AM

సైబర్‌ నేరగాళ్ల ‘డబుల్‌ టోకరా’!

సైబర్‌ నేరగాళ్ల ‘డబుల్‌ టోకరా’!

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ పశువైద్యుడిని టార్గెట్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు ఆర్మీ జాగిలాలకు వ్యాక్సినేషన్‌ పేరుతో ఎర వేశారు. పే టెస్టింగ్‌ అని, ఆ మొత్తం రిఫండ్‌ అంటూ రెండుసార్లు టోకరా వేశారు. మొత్తమ్మీద రూ.1.79 లక్షలు కోల్పోయిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సదరు పశువైద్యుడికి (27) రెండు రోజుల క్రితం ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆర్మీ అధికారులుగా చెప్పుకున్న వ్యక్తులు బాధితుడితో మాట్లాడారు. తమ యూనిట్‌లో ఉన్న 90 జాగిలాలకు వ్యాక్సినేషన్‌ చేయాలని చెప్పారు. ఈ పశువైద్యుడు గతంలో కొన్ని ఆర్మీ జాగిలాలకు వ్యాక్సిన్లు వేసి ఉండటంతో ఈ పని చేయడానికి అంగీకరించారు. ఇతడిని పూర్తిగా నమ్మించడానికి సైబర్‌ నేరగాళ్లు ఆర్మీ అధికారుల మాదిరి తయారు చేసిన నకిలీ గుర్తింపుకార్డుల్నీ పంపారు. చెల్లింపుల విషయం ఖరారు చేయడానికి తమ ఉన్నతాధికారులు సంప్రదిస్తారంటూ సైబర్‌ నేరగాళ్లు చెప్పారు. ఆపై కాల్‌ చేసిన మరికొందరు ఆర్మీ ఉన్నతాధికారులుగా పరిచయం చేసుకున్నారు. ఇది ఆర్మీకి సంబంధించిన వ్యవహారం కావడంతో వీడియో కాల్‌లో మాట్లాడుకుందామని చెప్పారు. ఆర్మీ అధికారుల యూనిఫాంలోనే ఉండి మాట్లాడిన సైబర్‌ నేరగాడు మొత్తం బిల్లులో సగం వ్యాక్సినేషన్‌ ప్రారంభించడానికి ముందు, మిగిలిన మొత్తం తర్వాత ఇస్తామని చెప్పాడు. పే చేసిన మొత్తం మీకు చేరుతుందో లేదో పరీక్షించాలంటూ వైద్యుడి ఫోన్‌లో ఫేన్‌ పే తెరిపించారు. అందులోని క్రెడిట్‌ కార్డు బిల్లు పేమెంట్‌ సెక్షన్‌లోకి వెళ్లమని చెప్పారు. తమ క్రెడిట్‌కార్డుకు సంబంధించిన వివరాలు, ఫోన్‌ నెంబర్‌ చెప్పిన సైబర్‌ నేరగాళ్లు ఆ మొత్తం చెల్లించమని చెప్పారు. తనకు నగదు కావాల్సి ఉండగా తాను చెల్లించడం ఏమిటంటూ బాధితుడు ప్రశ్నించాడు. తమ క్రెడిట్‌ కార్డుకు టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ విధానం అమలో ఉందని, మీరు పే బటన్‌ నొక్కినా చెల్లింపు పూర్తి కాదని నమ్మించారు. ఇది నమ్మిన వైద్యుడు అలా చేయడంతో కొంత మొత్తం నష్టపోయారు. దీనిపై సైబర్‌ నేరగాళ్లను ప్రశ్నించగా..ఆ మొత్తం రిఫండ్‌ వస్తుందంటూ మరోసారి అలానే చేయించారు. రెండోసారి చేయడానికి బాధితుడు సంశయించగా.. అలా చేయకపోతే రిఫండ్‌ రాదని భయపెట్టారు. దీంతో రెండోసారీ సైబర్‌ నేరగాళ్ల క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లించిన వైద్యుడు రూ.1,79,998 నష్టపోయారు. ఐదు నిమిషాల్లో మొత్తం రిఫండ్‌ వస్తుందని చెప్పిన నేరగాళ్లు ఆపై స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లు బాధితుడు గుర్తించాడు. ఈ మేరకు మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నిందితుల ఫోన్‌ నెంబర్లతో పాటు క్రెడిట్‌కార్డు వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెటర్నరీ డాక్టర్‌ను టార్గెట్‌ చేసిన కేటుగాళ్లు

ఆర్మీ జాగిలాలకు వ్యాక్సినేషన్‌ పేరుతో ఎర

పే టెస్టింగ్‌, రిఫండ్‌ పేర్లతో నగదు స్వాహా

సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో బాధితుడి ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement