పోలింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరం | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరం

Published Thu, Apr 24 2025 8:42 AM | Last Updated on Thu, Apr 24 2025 8:42 AM

పోలిం

పోలింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరం

ఫలించిన కేటీఆర్‌ హుకుం

కాంగ్రెస్‌, ఎంఐఎం, బీజేపీల నుంచి అందరూ హాజరు

112 మందికిగాను ఓటేసింది 88 మంది

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌

అప్పుడు అలా..

ఉమ్మడి రాష్ట్రంలో ఒక పర్యాయం హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్ధానానికి రెండు పార్టీలు పోటీకి దిగగా, ఓటర్ల బలం లేని పార్టీ తీరా పోలింగ్‌ రోజున బహిష్కరించడంతో సాంకేతికంగా పోలింగ్‌ జరిగినప్పటికీ, ఎన్నిక ఏకగ్రీవమే అయినట్లు సమాచారం.

సాక్షి, సిటీబ్యూరో:

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అవాంఛనీయ ఘటనలేమైనా జరుగుతాయేననే భయాందోళనలతో పాటు పలు ఊహాగాలకు తావిచ్చింది. పలు ప్రచారాలతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఎన్నికలో ఓటర్లు కేవలం ప్రజాప్రతినిధులే కావడం.. పార్టీల వారీగా సంఖ్యాబలంతోనే గెలవలేమని తెలిసి తక్కువ ఓట్లున్న పార్టీలు పోటీ చేయకపోవడంతో గతంలో ఏకగ్రీవంగానే ఈ ఎన్నిక ముగిసేది. ఈసారి తగిన సంఖ్యాబలం లేనప్పటికీ, బీజేపీ పోటీలో దిగడం, ఇతర పార్టీల ఓట్లనూ కూడగడతామని ధీమాగా చెప్పడంతో ఈ ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ పోలింగ్‌ను తాము బహిష్కరిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. ఆ పార్టీ వారి వైఖరి ఏమిటన్నది పోలింగ్‌ ముగిసేంత వరకూ సస్పెన్స్‌గానే సాగింది. ఒక దశలో నలుగురైదుగురు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పోలింగ్‌కు వస్తున్నట్లు మీడియాలో కొందరికి సమాచారమిచ్చి, అంతలోనే ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలిసింది.

రెండు కేంద్రాల్లో పోలింగ్‌

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది. బుధవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సమయమున్నప్పటికీ, మధ్యాహ్నం 2 గంటల వరకే 78.57 శాతంతో పోలింగ్‌ పూర్తయింది. మొత్తం 112 మంది ఓటర్లలో (కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు) 88 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. మిగతా 24 మంది బీఆర్‌ఎస్‌ వారిగా భావిస్తున్నారు. అన్ని పార్టీల్లో వెరసి ఎక్స్‌అఫీషియో సభ్యులు 31 మందిలో 22 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 81 మంది కార్పొరేటర్లలో 66 మంది ఓట్లేశారు.

తొలుత బీజేపీ..

పోలింగ్‌ సమయం ప్రారంభమయ్యాక తొలుత బీజేపీ నుంచి కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డా.కె. లక్ష్మణ్‌ వరుసగా ఓట్లు వేశారు. అనంతరం ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్‌ ఒవైసీ, జాఫర్‌ హుస్సేన్‌, మాజిద్‌ హుస్సేన్‌, అహ్మద్‌ బలాలా, మహ్మద్‌ ముబిన్‌, కౌసర్‌ తదితరులు ఒకరి తర్వాత ఒకరు ఓట్లు వేశారు. టీజేఎస్‌ ఎమ్మెల్సీ కోదండరామ్‌, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, ప్రస్తుత ‘స్థానిక’ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, శ్రీగణేశ్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌రెడ్డితో పాటు ఇతర కార్పొరేటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ విడిగా వచ్చి ఓటేశారు. బీఆర్‌ఎస్‌ మినహా మిగతా పార్టీలకు చెందిన ఓటర్లందరూ పోలింగ్‌లో పాల్గొన్నారు.

ఎంఐఎం గెలుపు లాంఛనమే..

పోలింగ్‌లో 88 మంది పాల్గొన్నందున సగం కంటే ఎక్కువ.. అంటే 45 ఓట్లు వచ్చిన వారు విజేతగా నిలుస్తారు. ఎంఐఎం పార్టీకి స్వతహాగానే 49 ఓటర్ల బలం ఉండటంతో పాటు కాంగ్రెస్‌ ఓట్లు కూడా వారికే పడే అవకాశ ఉండటంతో ఎంఐఎం గెలుపు లాంఛనమేనని భావిస్తున్నారు. బీజేపీ మాత్రం తమకు కొన్ని కాంగ్రెస్‌ ఓట్లు పడ్డట్లు చెబుతోంది.

స్ట్రాంగ్‌రూమ్‌లకు బ్యాలెట్‌ బాక్స్‌లు

పోలింగ్‌ ముగిశాక బ్యాలెట్‌ పత్రాలున్న బాక్స్‌లను జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లోకి తరలించారు.

ఓటు వేస్తున్న నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి

పోలింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరం 1
1/2

పోలింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరం

పోలింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరం 2
2/2

పోలింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement