
ప్రపంచం మొత్తం మీద శనివారం నాటికి కరోనా కారణంగా 30 లక్షల మంది మరణించారు.
రియో డీ జనీరో: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపుతోంది. ప్రపంచం మొత్తం మీద శనివారం నాటికి కరోనా కారణంగా 30 లక్షల మంది మరణించారు. ఈ వివరాలను జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అందించింది. ప్రత్యేకించి భారత్, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి దేశాల్లో కరోనా మహమ్మారి తాజా పంజా విసురుతోంది. మొత్తం మరణాలు వెనెజులాలోని కరైకాస్ నగర జనాభాకు దాదాపు సమానం కావడం గమనార్హం.
కొన్ని దేశాల ప్రభుత్వాలు కరోనా మరణాలకు సంబంధించి పూర్తి వివరాలను బయటకు వెల్లడించడం లేదని భావిస్తున్నారు. అమెరికా, భారత్ వంటి దేశాల్లో టీకాలు భారీస్థాయిలో ఇస్తున్నా మరణాలూ భారీ సంఖ్యలో ఉంటున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 12 వేలకుపైగా మరణాలు, ఏడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలోనే ఇప్పటి వరకూ 5,60,000లకు పైగా మరణాలు సంభవించాయి.