
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ ఉత్తరప్రాంతంలో శుక్రవారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో 300 మందికి పైగా ప్రజలు మృతి చెందినట్లు ఐరాస ఆహారం విభాగం తెలిపింది. వెయ్యి వరకు నివాసాలు ధ్వంసం కాగా వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని పేర్కొంది. బాధితులకు ఆహారం అందజేస్తున్నట్లు శనివారం తెలిపింది.
బఘ్లాన్, బాదాక్షాన్, ఘోర్, హెరాట్, టఖార్ ప్రావిన్స్‌ల్లో ఎక్కువ నష్టం సంభవించినట్లు తాలిబన్ ప్రభుత్వం తెలిపింది. బఘ్లాన్‌లో 131 మంది, టఖార్‌లో 20 మంది మరణించారని వెల్లడించింది. డజన్ల కొద్దీ గల్లంతయ్యారని కూడా తెలిపింది. బఘ్లాన్‌లో వరదల్లో చిక్కుకుపోయిన వారిని వైమానిక దళం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోందని తెలిపింది. 100 మందికి పైగా క్షతగాత్రులను సైనిక ఆస్పత్రులకు తరలించినట్లు రక్షణ శాఖ వివరించింది.