
- భారత్-పాక్ దంపతుల ఆవేదన
- సరిహద్దులో గందరగోళం
- కమ్ముకుంటున్న ‘డిపోర్టేషన్’ భయాలు.
భారత్-పాక్ సరిహద్దులో గందరగోళం రాజ్యమేలుతోంది. కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడితో అమల్లోకొచ్చిన భారత ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామంతో ఇరు దేశాలకు చెందిన కొందరు దంపతులు చిక్కుల్లో పడ్డారు. కొందరు భారతీయ భర్తలు, పాకిస్థానీ భార్యలు, అలాగే మరికొందరు పాక్ భర్తలు, భారతీయ భార్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత ప్రభుత్వ ఆదేశానుసారం పాక్ జాతీయులందరూ ఇండియాను వదిలి ఈ నెల 27లోగా తమ స్వదేశం వెళ్లిపోవాల్సివుంది. దీంతో పాక్ నుంచి కోడళ్లుగా వచ్చి మెట్టినిల్లు ఇండియాలో ‘అక్రమంగా’ స్థిరపడిన కొందరిలో భయం మొదలైంది.
భారత్-పాక్ సరిహద్దుల్లో మరికొందరు రకరకాల కారణాలతో ఆందోళనలు చేపడుతున్నారు. భారతీయ ప్రేమికుడు సచిన్ మీనాను వివాహమాడటానికి 2023లో పాక్ నుంచి నేపాల్ గుండా తన నలుగురు పిల్లలతో కలసి (అంతక్రితమే సింధ్ ప్రావిన్సులో ఈమెకు పెళ్లయింది) అక్రమంగా భారత్ వచ్చిన తన గతేమిటని సీమా హైదర్ నేడు ప్రశ్నిస్తోంది. లెక్కయితే ఇప్పుడు ఆమె కూడా స్వదేశానికి తరలిపోవాలి. ఆమె, సచిన్ ప్రస్తుతం గ్రేటర్ నోయిడా (ఉత్తరప్రదేశ్)లో నివసిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ‘నేను అప్పుడు పాక్ కూతురిని. ఇప్పుడు భారత్ కోడలిని. మీనాతో పెళ్లి అనంతరం నేను హిందూ మతం స్వీకరించాను. నాకు పాక్ వెళ్లాలని లేదు’ అని సీమా అంటోంది. సచిన్ మీనాతో కాపురం చేసి ఆమె ఓ కుమార్తె (పేరు భారతీ మీనా)కు జన్మనిచ్చింది.
సీమా ఇక ఎంతమాత్రమూ పాక్ జాతీయురాలు కాదని, సీమా పౌరసత్వం భర్తతో ముడిపడివుంది కనుక భారత ప్రభుత్వ తాజా ఆదేశం ఆమెకు వర్తించదని ఆమె తరఫు న్యాయవాది చెబుతున్నారు. సీమా మాదిరిగా అక్రమ దారుల్లో ఇండియాలో ప్రవేశించిన పాకిస్థానీలు ప్రస్తుతం దేశ బహిష్కరణ (డిపోర్టేషన్) ముప్పు ఎదుర్కొంటున్నారు. ఇక రాజస్థానీ మహిళ బాజిదా ఖాన్ గోడు చూద్దాం. ఆమెకు పాక్ జాతీయుడితో పెళ్లయింది. కొంత సమయం పుట్టినింటి వారితో గడుపుదామని తన ఇద్దరు మైనర్ కుమారులను వెంటబెట్టుకుని ఆమె ఇండియాకు వచ్చింది. పిల్లలిద్దరికి పాక్ పాస్పోర్టులు ఉన్నాయి. ఇంకొన్నాళ్లు ఇండియాలోనే ఉందామని బాజిదా ఖాన్ భావించినా ఇక్కడి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 27లోగా ఆమె ఇండియా వీడి పాక్ వెళ్లక తప్పని పరిస్థితి.
దీంతో ఆమె పాక్ వెళ్లడానికి శుక్రవారం వాఘా-అటారీ సరిహద్దును చేరుకుంది. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. పాక్ పాస్పోర్టులున్నాయి కనుక ఆమె ఇద్దరు కుమారులు పాక్ భూభాగంలో ప్రవేశించవచ్చని, భారతీయ పాస్పోర్ట్ ఉన్నందున బాజిదాకు ఆ అవకాశం లేదని తేలింది. దీంతో ఆమె హతాశురాలైంది. ఐదేళ్ల కొడుకును చంకనెత్తుకుని పాకిస్థాన్లోని అత్తారింటికి బయల్దేరి సరిహద్దుకు చేరుకున్న రషీదా ఖాన్ కూడా అదే అనుభవాన్ని చవిచూసింది. ఆమెకు పాక్ జాతీయుడితో వివాహమైంది. పంజాబ్ (ఇండియా)లో ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు ఆమె ఇక్కడికొచ్చింది. తిరిగి పాక్ వెళ్లిపోదామని సరిహద్దుకు చేరుకుంటే భారతీయ పాస్పోర్ట్ ఉందన్న కారణంతో ఆమెను నిలిపివేశారు. ఆమె కుమారుడికి మాత్రం పాక్ పాస్పోర్టు ఉంది. ఓ వితంతువు మరో దీనగాథ చెప్పుకుంది.
తాను 20 ఏళ్లుగా పాక్ లో నివసిస్తున్నప్పటికీ ఆ దేశ పౌరసత్వం లేదని, తన ఇద్దరు టీనేజి కుమార్తెలతో కలసి ఇప్పుడు పాక్ వెళ్లడానికి అనుమతించాలని ఆమె అభ్యర్థిస్తోంది. తన వివాహ పత్రాలు, భర్త మరణ ధృవీకరణ పత్రం, పాక్ పౌరసత్వం కోసం సమర్పించిన దరఖాస్తు తాలూకు ఆధారాలు సైతం ఉన్నాయంటూ ఆమె బావురుమంటోంది. పాక్ వెళ్ళేందుకు అనుమతించాలని ఆమె భారత సర్కారును అభ్యర్థిస్తోంది. మరోవైపు బులంద్ షహర్ (ఉత్తరప్రదేశ్)లో కుటుంబాలను కలిగిన నలుగురు మహిళలను భారత ప్రభుత్వం పాక్ కు తిప్పి పంపింది. “మా పిల్లలు, కుటుంబాలు ఇండియాలో ఉన్నాయి. మేం అక్కడికి ఎలా వెళ్లి జీవిస్తాం?” అని వారిలో ఓ మహిళ లబోదిబోమంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పాక్ జాతీయులకు సంబంధించి మెడికల్ వీసాలు ఈ నెల 29 వరకు చెల్లుబాటవుతాయని, ఇతర అన్ని వీసాలు నెల 27 నుంచి రద్దవుతాయని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
- జమ్ముల శ్రీకాంత్