
68 మంది దుర్మరణం
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌ను మరోసారి ఆకస్మిక వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీంతో వరదలు, వర్ష సంబంధ ఘటనల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రాథమికంగా అందిన సమాచారం అని మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని తాలిబాన్ అధికారులు శనివారం వెల్లడించారు. గత వారం పోటెత్తిన వరదవిలయం నుంచి తేరుకోకముందే మరో జలఖడ్గం అఫ్గానిస్తాన్‌పై దండెత్తి డజన్లకొద్దీ ప్రాణాలను బలితీసుకుంది.
పశి్చమ ప్రావిన్స్ ఘోర్‌లో అత్యధికంగా 50 మంది మరణించారని ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి అబ్దుల్ వహీద్ హమాస్ చెప్పారు. ప్రావిన్స్ రాజధాని ఫెరోజ్ కోహసహా వేలాది ఇళ్లు, వందల హెక్టార్లలో వ్యవసాయభూములు నాశనమయ్యాయి. ఉత్తర ఫరాయాబ్ ప్రావిన్స్‌లో 18 మంది చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాల్లో వరదవిలయం దారుణంగా ఉందని, 300కుపైగా మూగజీవాలు మృతిచెందాయని గవర్నర్ అధికార ప్రతినిధి ఏస్మతుల్లాహ్ మొరాదీ చెప్పారు. ఘోర్ ప్రావిన్స్‌లో 2,500 కుటుంబాలు వరదబారిన పడ్డాయి.