
అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పహల్గాం దాడి అనంతరం భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘స్కై న్యూస్’ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు ఇవ్వడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని.. దీని మీరు అంగీకరిస్తారా? అంటూ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘‘అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు తాము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామంటూ ఖవాజా బదులిచ్చారు.
సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్‌కు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉండేదన్నారు. లష్కరే తోయిబాకు గతంలో పాకిస్థాన్‌తో కొన్ని సంబంధాలు ఉన్నాయని కూడా ఖవాజా ఆసిఫ్ అంగీకరించారు. అయితే, ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ అంతమైందన్నారు.