
పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు నరమేధం జరిపి 26 మందిని పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. కశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే కావడం గమనార్హం. అయితే లష్కర్-ఇ-తోయిబా(LeT) తరఫున కరడుగట్టిన టీఆర్‌ఎఫ్ గ్రూప్ ఈ ఘాతుకానికి పాల్పడగా.. ఆ సంస్థ కదలికలపై భద్రతా ఏజెన్సీలు ఓ అంచనాకి వచ్చాయి.
లష్కరే తోయిబా విష సర్పానికి పుట్టిన పిల్ల పామే.. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్). 2019లోనే ఇది పుట్టింది. ఈ విభాగానికి తొలినాళ్లలో షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్‌గా, చీఫ్ ఆపరేషనల్ కమాండర్‌గా బాసిత్ అహ్మద్ దార్ వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి లష్కరే చీఫ్ హఫీజ్ సయ్యద్(hafiz saeed) కనుసన్నల్లోనే నడుస్తోంది. డిప్యూటీ హెడ్‌గా సైఫుల్లా(హిజ్బుల్ ముహజిదిన్) వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరూ పాక్ నుంచే ఎల్‌ఈటీ కార్యకలాపాలను నడిపిస్తున్నారనే అభియోగాలు ఉండనే ఉన్నాయి. పాక్ సైన్యం, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI) టీఆర్‌ఎఫ్ గ్రూపులకు సైద్ధాంతికపరమైన మద్దతు మాత్రమే కాదు.. అన్నిరకాలుగా మద్దతు ఇస్తున్నాయని భారత గూఢచార సంస్థలు భావిస్తున్నాయి.
తొలినాళ్లలో జిహాదీ పేరిట ఆన్‌లైన్‌లో The Resistance Front సంస్థ పోస్టులు చేసేది. కశ్మీరీలు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా గప్‌చుప్ ప్రచారాలు చేసేది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్‌లైన్ ద్వారా యువతను నియమించుకునేది. ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడింది. ఆ సమయంలో ఈ గ్రూప్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు జమ్ము పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదు. ఆ తర్వాత హిజ్బుల్ ముహజిదిన్, లష్కరే తొయిబా సభ్యులతోనే చాన్నాళ్లు నడిచింది. కానీ, ఆ తర్వాతే ఈ గ్రూపులో విదేశీ ఉగ్రవాదుల చేరిక క్రమంగా పెరుగుతూ వచ్చింది. వీళ్లకు కశ్మీర్ నుంచి స్థానిక ఉగ్రవాదుల మద్దతు లభిస్తూ వస్తోంది. అలా.. ఈ సంస్థ కశ్మీర్ లోయలో చాలా కాలంగా యాక్టివ్‌గా ఉంది. 2023లో కేంద్రం హోం శాఖ ఈ గ్రూప్‌పై విషేధం విధించింది.
ఇంతకుముందు.. సోనామార్గ్, బూటా పాత్రి, గందర్బల్ దాడులకు ఈ సంస్థే కారణమని భద్రతా సంస్థలు బలంగా నమ్ముతున్నాయి. కిందటి ఏడాది అక్టోబర్‌లో బూటా పాత్రి ఇద్దరు సైనికులు సహా నలుగురిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. అదే నెలలో సోనామార్గ్ టన్నెల్ పనులు జరుగుతున్న ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు కార్మికులు, ఓ డాక్టర్ చనిపోయారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది హషీమ్ మూసా.. సోనామార్గ్ దాడిలోనూ పాల్గొన్నట్లు స్పష్టంగా తేలింది. అయితే సోనామార్గ్ ఘటన తర్వాత.. ఎల్‌ఈటీ ఏఫ్లస్ కేటగిరీ ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్‌ను డిసెంబర్‌లో దాచిగామ్ వద్ద భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఇదే ఎన్‌కౌంటర్‌లో గ్రూప్ సభ్యులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు.
సాధారణంగా దాడులకు పాల్పడ్డాక టీఆర్‌ఎఫ్ గ్రూప్ సభ్యులు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోతారు. దట్టమైన అడవుల్లో తలదాచుకుంటూ.. పాక్ నుంచి గ్రూప్ నేతలు ఆదేశాలు కోసం ఎదురు చూస్తుంటారు. టీఆర్‌ఎఫ్‌ను తన కనుసన్నల్లోనే నడిపిస్తున్న హఫీజ్ సయ్యదే.. పహల్గాం దాడికి మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యదే అయి ఉండొచ్చని నిఘా సంస్థలు భావిస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీన.. గురువారం జమ్ము కశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్‌లు రిలీజ్ చేశారు.
అందులో హషిమ్ మూసా అలియాస్ సులేమాన్, అలీ బాయి అలియస్ తల్హా పాకిస్థానీలుగా జమ్ము పోలీసులు ప్రకటించారు. మిగతా ఇద్దరు అబ్దుల్ హుస్సేన్ తోకర్, అసిఫ్‌లు స్థానికులేనని ప్రకటిచారు. ఈ ఇద్దరూ 2018లో కశ్మీర్‌కు వెళ్లి.. ఎల్‌ఈటీలో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత టీఆర్‌ఎఫ్‌లో సహాయకులుగా చేరి.. పహల్గాం మారణ హోమంలో భాగం అయ్యారు.
ప్లాన్ ప్రకారమే..
సైనికుల దుస్తుల్లో వచ్చిన టీఆర్‌ఎఫ్ ఉగ్రవాదులు.. బైసరన్ లోయలోని పిక్నిక్ స్పాట్‌లో మూడు వేర్వేరు ప్రాంతాలను ఎంచుకుని దాడికి పాల్పడ్డారు. తొలుత పర్యాటకులతో చాలాసేపు వాళ్లు మాట్లాడారు. ఆ తర్వాత పర్యాటకుల్లో ఐదుగురిని ఒక చోట చేర్చి చంపారు. మైదానంలో మరో ఇద్దరిని కాల్చి చంపారు. పారిపోతున్న క్రమంలో.. ఫెన్సింగ్ వద్ద ఇంకొందరిని కాల్చి చంపారు. ఫెన్సింగ్ దూకిన వాళ్లు ప్రాణాలతో బయటపడగలిగారు.