
ఇస్లామాబాద్: సరిహద్దు వెంట తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘనలతో కవ్వింపు చర్యలకు పాల్పడే పాకిస్తాన్ పహల్గాం ఉదంతం తర్వాత సైతం తన బుద్ధిని మార్చుకోలేదు. తాజాగా కరాచీ తీరం వెంట క్షిపణి పరీక్షను చేపట్టబోతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ మేరకు తూర్పున ఉన్న కరాచీ తీరంలో భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించి క్షిపణిని పరీక్షించనున్నట్లు ఒక నోటీస్‌ను జారీచేసింది.
అరేబియా సముద్రంలో తమ పరిధిలోని సముద్రజలాల మీదుగా ఎలాంటి వైమానిక రాకపోకలు లేకుండా నిషేధం అమల్లోకి తెచ్చింది. ఆ ప్రాంతాన్ని నో–ఫ్లై జోన్‌గా ప్రకటించింది. ఆ పరిధిలో నావికులు సంచరించకూడదని హెచ్చరించింది. దాదాపు 480 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల మిస్సైల్‌ను పరీక్షంచనుంది. పాక్ తన ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్(ఈఈజెడ్)ప్రాంతంలో ఏప్రిల్ 25వ తేదీన ఈ క్షిపణి పరీక్ష చేపట్టే అవకాశం ఉందని భారత రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పహల్గాం ఉదంతంపై ఆగ్రహంతో భారత్ తమపై ప్రతీకార దాడులకు దిగితే తాము కూడా అందుకు సన్నద్ధంగా ఉన్నామని తెలియజేప్పేందుకే పాకిస్తాన్ ఇలా క్షిపణి పరీక్షలకు దిగిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు.