
సన్నాహక విన్యాసాలు చేస్తున్న భారత వాయుసేన యుద్ధవిమానాలు
న్యూఢిల్లీ: పహల్గాం దాడికి ప్రతీకారంగా, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై భారత వాయుసేన దాడులు చేయొచ్చనే అంచనాలకు బలం చేకూర్చేలా గురువారం కొత్త పరిణామం సంభవించింది. సెంట్రల్ సెక్టార్‌లో ‘ ఎక్సర్‌సైజ్ ఆక్రమణ్’ పేరిట భారత వాయుసేన అతిపెద్ద వైమానిక విన్యాసాలు మొదలెట్టింది. సమతల మైదాన ప్రాంతాలతోపాటు దుర్భేద్య పర్వతమయ ప్రాంతాల్లో శత్రుమూకలను ఎలా తుదముట్టించాలి? ఎలా సులువుగా తప్పించుకోవాలి అనే అంశాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాలు అభ్యాసం చేశాయని రక్షణ రంగంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
విదేశం నుంచి కొనుగోలు చేసుకున్న అత్యంత అధునాతన రఫేల్ యుద్ధ విమానాలు ముందుండి డ్రిల్ చేయగా వాటిని అనుసరిస్తూ సుఖోయ్–30, ఇతర రకాల యుద్ధవిమానాలు ఈ వైమానిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. శత్రుస్థావరాలను ధ్వంసంచేయడం, శత్రువుల దాడుల నుంచి ఒడుపుగా తప్పించుకోవడం, ప్రతిదాడి చేస్తే దీటుగా బదులివ్వడం, సుదూరంలోని లక్ష్యలపై దాడిచేయడం వంటివి మరోసారి అభ్యసనం చేశారు. తూర్పు సెక్టార్‌లోని స్థావరాల్లోని బలగాలు ఈ అభ్యసనంలోని బృందాలకు సాయపడుతున్నాయి.
నిజంగా యుద్ధం వస్తే హఠాత్పరిణామాలను ఎదుర్కొనేలా యుద్ధవిమాన పైలెట్లకు దోహదపడేలా ఈ విన్యాసాలకు పథకరచన చేసినట్లు తెలుస్తోంది. భూతలం మీద లక్ష్యాలతోపాటు విద్యుదయస్కాంత సైనిక ఉపకరణాల వినియోగంపైనా మరింత పట్టుచిక్కేలా డ్రిల్ కొనసాగుతున్నట్లు సమా చారం. భారతవాయుసేన పైలట్లలో అత్యంత దూకుడు, నైపుణ్యమున్న ‘టాప్ గన్’ పైలట్లతో ఈ వైమానిక విన్యాసాలు చేయిస్తు న్నారు. దూరంలోని లక్ష్యాలపై బాంబులు జారవిడవడం వంటివి ప్రాక్టీస్ చేస్తున్నారు. సమరంలో సన్నద్ధత, అత్యంత నైపుణ్యం సాధించడంపై జరుపుతున్న ఈ అభ్యాసా న్ని ఐఏఎఫ్‌లోని సీనియర్ ఉన్నతాధి కారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు పంజాబ్‌లోని అంబాలా స్థావరం నుంచి, పశ్చిమబెంగాల్‌లోని హషిమరా స్థావరం నుంచి శత్రు భీకర రఫేల్ యుద్ధవిమానాలు బయల్దేరి వెళ్లాయి.