
న్యూయార్క్/చండీగఢ్: గ్యాంగ్‌స్టర్ నుంచి ఉగ్రవాదిగా మారిన హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియా అలియాస్ జోరా అమెరికాలో అరెస్టయ్యాడు. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ, ఖలిస్తానీ సంస్థ బీకేఐతో సంబంధాలున్న హ్యాపీ పాసియా పంజాబ్‌లో పలు ఉగ్రవాద దాడుల ఘటనల్లో నిందితుడిగా రికార్డుకెక్కాడు. వాంటెట్ జాబితాలో ఉన్న జోరా కోసం భారత దర్యాప్తు అధికారులు వెతుకుతున్నారు. అమెరికాలోని శాక్రమెంటో నగరంలో ఎఫ్‌బీఐ అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా అధికారులు శుక్రవారం వెల్లడించారు.
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినందుకు అక్కడి అధికారులు అరెస్టు చేసినట్లు తెలిపారు. పంజాబ్‌లో 16 ఉగ్రవాద దాడుల్లో జోరా ప్రమేయం ఉన్నట్లు భారత అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అతడిపై రూ.5 లక్షల నగదు రివార్డు ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్ జిల్లాలోని పాషియా గ్రామంలో జని్మంచిన జోరా తొలుత గ్యాంగ్‌స్టర్‌గా వ్యవహరించాడు. తర్వాత పాకిస్తాన్, ఖలిస్తాన్ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకొని ఉగ్రవాదిగా మారాడు. 2018 ఏప్రిల్‌లో దుబాయ్‌కి చేరుకున్నాడు. 2019లో ఫిబ్రవరిలో ఇండియాకు తిరిగివచ్చాడు. 2020 అక్టోబర్‌లో లండన్‌కు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయాడు.