
చెరువులో గల్లంతైన వ్యక్తి శవమై..
జగిత్యాలక్రైం: తన నానమ్మ కర్మకాండ చేసేందుకు వెళ్లి చింతకుంట చెరువులో గల్లంతైన నీలి మల్లికార్జున్ (30) శవమై తేలాడు. జిల్లాకేంద్రంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన మల్లికార్జున్ బుధవారం ఉదయం తన నానమ్మ కర్మకాండ చేసేందుకు చింతకుంట శ్మశాన వాటికకు వెళ్లాడు. కర్మకాండ పూర్తయిన తర్వాత చెరువులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్లు గాలించినా మృతదేహం లభ్యం కాలేదు. గురువారం ఉదయం శవమై కనిపించాడు. మృతుడి తల్లి మల్లీశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై మన్మథరావు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
మల్యాల(చొప్పదండి): మండలంలోని కొండగట్టు ఘాట్ రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం (75) కనిపించినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు గురువారం సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. ముత్యంపేట కారోబార్ రాజేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి
సారంగాపూర్: మండలంలోని కోనాపూర్ శివారు ఎల్లమ్మ గుడి సమీపంలో గురువారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై దత్తాద్రి, గ్రామస్తుల కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లికి చెందిన బేతి మధు (30) గుల్లపేటలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. తిరిగి బాలపల్లి బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో గుల్లపేటకు చెందిన జగదీష్, రాజిరెడ్డి పొరండ్ల వెళ్లి బైక్‌పై గుల్లపేటకు వెళ్తున్నారు. ఎల్లమ్మ ఆలయం వద్ద మధు, జగదీశ్ వాహనాలు ఢీకొనడంతో మధు అక్కడికక్కడే మృతిచెందాడు. రాజిరెడ్డి, జగదీశ్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జగదీశ్ పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలించారు.
ఆన్‌లైన్ షాపింగ్‌లో మోసం
సిరిసిల్లక్రైం: కుటుంబ అవసరాల కోసం ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకు ప్రయత్నించగా రూ.2లక్షలు మోసపోయారు. ఈ మేరకు సిరిసిల్లటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన పూస శ్రీనివాస్ తన గృహ అవసరాల కోసం ఆన్‌లైన్‌లో కొన్ని వస్తువులను కొనేందుకు క్రెడిట్‌కార్డ్ నంబర్లను ఎంటర్ చేశాడు. సీవీఈవ పిన్ ఎంటర్ చేయగానే కార్డులో ఉన్న డబ్బులు తన ఆధీనంలో లేకుండానే పోవడం గమనించాడు. ఇలా రూ.2లక్షలు ఖాతా నుంచి పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

చెరువులో గల్లంతైన వ్యక్తి శవమై..