
ఒకే రోజు ఆరు అగ్నిప్రమాదాలు
కరీంనగర్‌క్రైం: జిల్లాలో మొత్తం ఆరు అగ్రిప్రమాదాలు సంభవించాయి. వెంటవెంటనే జరిగిన ఆరు అగ్ని ప్రమాదాలు ఫైర్ అధికారులను ఊపిరిపీల్చుకోనివ్వలేదు. మండుటెండలకు విపరీతమైన వేడితో గుర్తు తెలియని వ్యక్తులు పడేసిన అగ్నితో శాతవాహనలో అగ్నిమంటలు చెలరేగగా వెంటనే అప్రమత్తమైన యూనివర్సిటీ అధికారులే ఫైర్ అధికారులకు ఫోన్ చేశారు. డివిజన్ ఫైర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో కరీంనగర్ ఫైరింజిన్ శాతవాహన యూనివర్సిటీకి చేరుకొని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమవగా గాలికి మంటలు ఎక్కువ అవడంతో మానకొండూర్ నుంచి ఫైరింజిన్‌ను పిలిపించారు. కరీంనగర్, మానకొండూర్ ఫైర్ అధికారులు రాజ్‌కుమార్, భూదయ్యలు సిబ్బందితో కలిసి రాత్రి వరకు శాతవాహనలో పొగలురావడంతో అక్కడే ఫైరింజన్‌ల సహాయంతో సేవలు అందించారు.
● ఇవే మంటలకు చెందిన పొగలు కొత్తపల్లి పోలీస్‌స్టేషన్ వద్దకు రావడంతో అప్రమత్తమైన ట్రైనీ ఐపీఎస్ వసుంధరాయాదవ్ ఫైర్ అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే చేరుకొని అక్కడ విధులు నిర్వహించి మంటలు ఎగిసిపడకుండా చర్యలు చేపట్టారు. ఈప్రమాదంలో శాతవాహనలో వివిధ రకాల చెట్లు కాలిపోయాయి.
● పద్మనగర్‌లోని వ్యవసాయ కేంద్రం వెనుక నుంచి ప్రారంభమైన మంటలు యూనివర్సిటీ వైపు రావడంతో అక్కడి వైపు నుండి కూడా పొగమంటలు పెద్ద ఎత్తున రావడంతో వేములవాడకు చెందిన ఫైర్ ఇంజన్ పిలిపించారు.
● శాతవాహన యూనివర్సిటీ గేటువద్ద ఒక సానిటరీ షాపులో షాట్‌సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని వెంటనే యూనివర్సిటీలో సేవలందిస్తున్న మానకొండూర్ ఫైర్ ఇంజన్‌ను పంపించి అక్కడ మంటలను ఆర్పారు.
● కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం వద్ద గల ఐటీ టవర్ వెనక ప్రాంతంలో మంటలు చెలరేగడంతో స్థానికులు ఫోన్ చేయగా చొప్పదండి ఫైర్ ఇంజన్ తెప్పించి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదు.
● నాగులమల్యాలలోని ఇండ్ల పక్కన గల ఖాళీ ప్రదేశంలో మంటలు చెలరేగడంతో వేములవాడ ఫైర్ ఇంజిన్‌తో మంటలు ఆర్పారు.
శాతవాహనలో పెద్ద ఎత్తున మంటలు
రాత్రి వరకు సేవలందించిన నాలుగు స్టేషన్‌ల ఫైర్ సిబ్బంది

ఒకే రోజు ఆరు అగ్నిప్రమాదాలు