
చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
నవీపేట: మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. నిజామాబాద్ నార్త్‌రూరల్ పోలీస్ స్టేషన్ ఆవణలో శనివారం సీఐ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముప్కాల్ మండలంలోని కంజర్ గ్రామానికి చెందిన ముగ్గురు కూలీలు కాలూర్ లత, పంతుల విజయ, ఈర్ల సాయికుమార్ ప్రతిరోజు కలిసి కల్లు తాగేవారు. ఈక్రమంలో ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో షేర్‌చాట్‌ను ఫాలో అయ్యారు. కత్తి, కారంతో ఒక మహిళను బెదిరించి.. బంగారం దొంగిలించిన వీడియో వీరికి నచ్చింది. అంతే శుక్రవారం నవీపేటలో వారాంతపు కూరగాయల సంత ఉండడంతో అమాయకుల కోసం గాలించారు. ఈ క్రమంలో మండలంలోని నారాయణ్‌పూర్‌కు చెందిన రాచర్ల కిష్టాబాయి అనే వృద్ధురాలు ఒంటరిగా వెళ్తుండగా ఆమెను వెంబడించారు. కత్తితో బెదిరించి.. కంట్లో కారం చల్లి..బంగారు పుస్తెల గుండ్లు, పడిగెలను దోచుకుని పారిపోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.