బోయినపల్లి(చొప్పదండి): అంతర్జాతీయ చిత్ర కళాకారుడు తోట వైకుంఠం మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకోబోతున్నారు. తాజాగా 32వ యుద్‌వీర్ ఫౌండేషన్ స్మారక అవార్డుకు ఎంపికయ్యారు. చిత్రకళలో చేసిన సేవలకు అవార్డు ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్ వారు తెలిపారు. ఈనెల 30న హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఎఫ్‌టీసీసీఐలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా అవార్డు, రూ.లక్షల నగదు బహుమతి అందించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. 1942లో బూర్గుపల్లి గ్రామంలో జన్మించిన తోట వైకుంఠం చిత్రకారుడిగా అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ చిత్రకళా రంగంలో తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసి జిల్లా గర్వించదగ్గ వ్యక్తిగా నిలిచారు. సెప్టెంబర్ 2023లో ముంబై కేంద్రంగా పని చేసే అస్తాగురు అక్షన్ హౌస్ మోడరన్ ట్రేజర్స్ వేలం పాటలో తోట వైకుంఠం గీసిన కళాఖండానికి సుమారు రూ.కోటిన్నర ధర పలికింది. అపుడు వేలం పాటలో ఆయన గీసిన ఏడేళ్ల నాటి చిత్రం ఏకంగా రూ.1,41,35,220 ధర పలికింది. యాక్రిలిక్–ఆన్–కాన్వస్ వర్క్ ఆయన అత్యున్నత చిత్రకళా నైపుణ్యానికి నగదు ప్రోత్సాహం అందింది. చిన్నతనం నుంచే చిత్రకారుడు కావాలన్న బలీయమైన కోరిక ఆయనను గొప్ప చిత్రకారుడిగా తీర్చిదిద్దింది. సంప్రదాయ దుస్తులు, రంగుల చీరలతో ఉన్న ఆయన గీసిన మహిళల చిత్రాలు చూస్తే.. మహిళల చర్మ సౌందర్యం ప్రతిబింబిస్తుంది. డ్రెస్సింగ్‌తో మగవారి చిత్రాలు, డస్కీ స్కిన్‌తో మహిళల చిత్రాలు గీయడం వైకుంఠం ప్రత్యేకత.
అమ్మ వంట గది వస్తువులతో..
చిత్రకారుడిగా గుర్తింపు పొందడానికి అమ్మ, తెలంగాణ మహిళలే స్ఫూర్తని వైకుంఠం అన్నారు. అమ్మ వంట గదిలో ఉండే వస్తువులన్నీ తన చిత్రకళకు ఉపయోగపడ్డాయని చెప్పారు. రాముడు, కృష్ణుడు, రావణుడు, హనుమంతుడు, సీత, సత్యభామ లాంటి వేషాలకు తానే మేకప్ వేసి రంగులు దిద్దేవాడిన న్నారు.
బూర్గుపల్లిలో విద్యాభ్యాసం
బూర్గుపల్లిలో పోశెట్టి సారు దగ్గర అమ్మ అక్షరాలు నేర్పించింది. బోయినపల్లి, శాత్రాజ్‌పల్లి, వేములవాడ, సిరిసిల్లలో చదివి చివరకు హైదరాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చిత్రలేఖనం నేర్చుకున్నారు. మహారాజ సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో కేజీ సుబ్రమణియన్ దగ్గర శిష్యరికం చేశారు.
చిత్రాల తోట..
వైకుంఠం గీసిన చిత్రాలు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ప్రదర్శింపబడ్డాయి. ఆయన గీసిన చిత్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చిత్రాలు కొనుగోలు చేయడానికి పోటీ పడతారు.
అనేక అవార్డులు..
భోపాల్ రాష్ట్రంలో రెండేళ్లకోసారి ఇచ్చే భారత్‌భవన్ అవార్డుతోపాటు భారత ప్రభుత్వం ఓసారి జాతీ య అవార్డు, ఉమ్మడి రాష్ట్రంలో హంస అవార్డు ఇచ్చి ఆయనను సత్కరించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ చిత్ర కళాకారుడి అవార్డు లభించింది. ఆయన దాసి, మాభూమి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేయగా.. దాసి చిత్రానికి ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు రావడం మరచిపోలేని అను భూతిగా ఆయన పేర్కొంటారు. రంగుల్లో ఎర్ర, ఆకుపచ్చ, నీలం రంగులు తనకు ఇష్టంగా పేర్కొంటారు. రంగులు కలిపి చిత్రాలు గీయడం ఆయనకు ఇష్టముండదు. వైకుంఠంపై పలువురు డాక్యుమెంటరీ చిత్రాలు తీశారు. బూర్గుపల్లిలో పాఠశాల అభివృద్ధికి గతంలో విరాళాలందించారు.
ఎన్నో అవార్డులు.. మరెన్నో రివార్డులు
గతంలో వేలం పాటలో రూ.కోటికి పైగా పలికిన చిత్రం
తెలంగాణకే తలమానికం.. మన బూర్గుపల్లి వైకుంఠం
‘తోట’ సిగలో ‘యుధ్‌వీర్’ అవార్డు
‘తోట’ సిగలో ‘యుధ్‌వీర్’ అవార్డు