
యువ వికాసానికి స్పందన
● ఈ నెల 14 వరకు 28,116 దరఖాస్తులు
కార్పొరేషన్ల వారీగా దరఖాస్తులు
ఆసిఫాబాద్‌అర్బన్: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికోసం రుణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లాలో స్పందన వచ్చింది. నిరుద్యోగులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. పలుమార్లు సర్వర్ సమస్యలు తలెత్తినా ప్రజాపాలన కేంద్రాలు, మీసేవ కేంద్రాల వద్ద క్యూలైన్లు కట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగలకు సబ్సిడీపై రుణాలు అందించనుంది. మొదట ఈ నెల 5 వరకు గడువు నిర్ణయించారు. అయితే సర్వర్ సమస్యలు, దరఖాస్తుదారులు కుల, ఆదాయ ఇతర ధ్రువీకరణ పత్రాలు పొందడంలో తీవ్ర జాప్యం జరగడం.. అలాగేఏ యూనిట్‌కు అప్లై చేసుకుంటే ఎంత మొత్తం రుణం మంజూరు చేస్తారో నిర్ణయం కాకపోవడంతో చాలామంది దరఖాస్తు చేసుకునేందుకు వెనుకడుగు వేశారు. ఆ తర్వాత ప్రభుత్వం గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది. ఇప్పటివరకు జిల్లాలో 28,116 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
అదృష్టం ఎవరికో..
రాజీవ్ యువ వికాసం పథకానికి భారీగా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో అదృష్టం ఎవరిని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యువతతోపాటు పలువురు రైతులు మండల కేంద్రాలతోపాటు ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాలో ని మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తులు సమర్పించారు. ఇటీవల వరుసగా సెలవులు వచ్చినా ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఈ కేంద్రాలను తెరిచి ఉంచారు. మున్సిపల్, మండల కమిటీలు దరఖాస్తులను పరిశీలించి జిల్లా కమిటీకి సమర్పించనున్నారు. జిల్లా కమిటీలోని సభ్యులు జాబితాను పరిశీలించి అర్హులకు రుణాలు మంజూరు చేయనున్నారు. జిల్లాలో ఎస్సీ వర్గానికి 2,185 యూనిట్లు, బీసీ వర్గానికి చెందిన వారికి 1,845 యూనిట్లు, ఎస్టీ సామాజిక వర్గానికి 3,855 యూనిట్లు కేటాయించారు.
సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. రూ.50వేల యూనిట్లకు వందశాతం రాయితీ ఉండటంతోపాటు బ్యాంకులతో నిమిత్తం లేకుండా రుణం మంజూరవుతుంది. అలాగే వెరిఫికేషన్ ప్రక్రియ కూడా వేగంగా పూర్తవుతుంది. మైనార్టీ విభాగానికి సంబంధించి యూనిట్లు ప్రభుత్వం నుంచి మంజూరవుతాయి.
– అబ్దుల్ నదీం, డీఎండబ్ల్యూవో
ఎస్సీ 6,836
ఎస్టీ 7,233
బీసీ 12,096
మైనార్టీ 1,918
క్రిస్టియన్ 33
మొత్తం 28,116