
భయాందోళనలో ‘గిరి’ గ్రామం
● ఒకే కుటుంబంలో నలుగురు మృతి ● నెల క్రితం గ్రామం వదిలి వెళ్లిన కుటుంబాలు ● సమీప గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తలదాచుకుంటున్న వైనం ● భయం వీడాలని కోరిన ఏఎస్పీ చిత్తరంజన్
సాక్షి, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ మండలం సమతులగుండం గ్రామం జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గిరిజన గ్రామంలో 11 కుటుంబాలు కొన్నేళ్లుగా జీవిస్తున్నాయి. అక్కడి చేరుకోవాలంటే వాగులు వంకలు దాటాల్సిందే. ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు సౌకర్యమే లేదు. వ్యవసాయంపై ఆధారపడిన ఆ గ్రామస్తులు నెలరోజుల కిందట ఉన్న ఫలంగా ఇళ్లను ఖాళీ చేసి లింగాపూర్ మండలం భీమన్‌గొందిలోని ప్రాథమిక పాఠశాలలో తలదాచుకున్నారు. గత మార్చిలో గ్రామానికి చెందిన ఆత్రం రాజు(40), సోనుబాయి(35) దంపతులతోపాటు వారి కుమారులు భీము(22), మారుతి(20) అనారోగ్య కారణాలతో నెల రోజుల వ్యవధిలో మరణించడమే ఇందుకు కారణం. రాజు కుటుంబ సభ్యులు చనిపోవడంతో ఊరికి ఏదో పీడ ఆవహించిందన్న భయాందోళనతో 10 కుటుంబాలు గ్రామం వీడాయి. ఒక్క కుటుంబం మాత్రం చావోరేవో అన్న ధైర్యంతో అక్కడే ఉంటోంది.
మూఢ నమ్మకం.. భయం
చుట్టూ అడవులు.. ఆ అడవుల మధ్యలో ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో ఉన్న ఊరు భయంతో గజగజలాడుతోంది. భయాందోళనతో సమతులగుండం గ్రామ ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి నెల రోజులుగా సమీప గ్రామంలో బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్నారు. ఇది జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఏఎస్పీ చిత్తరంజన్ మంగళవారం ఉదయం ఆయా గ్రామాల్లో పర్యటించారు. సమతులగుండం ప్రజలను పరామర్శించారు. డాక్టర్‌తో వారికి వైద్యపరీక్షలు చేయించారు. భయం వీడి తిరిగి సొంత గ్రామానికి రావాలని గ్రామస్తులను కోరారు.
పట్టువీడని గ్రామస్తులు
జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్లలో దూరంలో ఉన్నప్పటికీ ఆ గ్రామం అభివృద్ధికి నేటికీ ఆమడ దూరంలోనే ఉంటోంది. పైగా మూఢ నమ్మకాలతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అపోహలను తొలగించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేయకపోవడంతో సమతులగుండం ప్రజలు నేడు ఊరు ఖాళీ చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామానికి ఏదో పీడ ఆవహించిందన్న మూఢనమ్మకంలో గ్రామం వీడిన సమతులగుండం గ్రామస్తులు మళ్లీ తిరిగి ఊరికి చేరుకోవడానికి ససేమీరా అంటున్నారు. ఏఎస్పీ చిత్తరంజన్ స్వయంగా వెళ్లి వారితో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. చివరకు మీకు నెలనెలా రేషన్ సరుకులు అందేలా సంబంధిత అధికార యంత్రాంగంతో మాట్లాడుతామని హామీ ఇచ్చినా.. వారు సుముఖంగా లేకపోవడం వారి భయాందోళనను తెలియజేస్తోంది. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు మూఢ నమ్మకాలపై కళాజాత బృందాలతో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.