
భూభారతితో సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
చింతలమానెపల్లి/బెజ్జూర్: భూభారతి చట్టంతో రైతుల భూముల సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. చింతలమానెపల్లి మండలం బాలాజీ అనుకోడ, బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతువేదికల్లో బుధవారం ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ వ్యక్తికి ఆధార్ ఉన్నట్లు భూముల సర్వే నంబర్‌కు ప్రభుత్వం భూధార్ జారీ చేస్తుందని తెలిపారు. భూభారతి చట్టంలో అప్పీలు చేసే అవకాశం ఉండటంతో భూవివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. జూన్ 2 నుంచి అన్ని మండలాల్లో చట్టం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అటవీ హద్దుల సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి సర్వేకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
ధరణిని బొంద పెట్టి భూభారతి తెచ్చాం
గత ప్రభుత్వం అమలు చేసిన ధరణిని బొందపెట్టి భూభారతి చట్టాన్ని తెచ్చామని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. ధరణి పోర్టల్‌తో చాలామంది రైతులు బాధితులుగా మారిపోయారన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అధికారులు సైతం ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. వీఆర్‌వో వ్యవస్థను ప్రవేశపెట్టి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం బెజ్జూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆయా కార్యక్రమాల్లో డీఏవో శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ దేవయ్య, పీఏసీఎస్ చైర్మన్ ఓంప్రకాశ్, ఏడీఏ మనోహర్, తహసీల్దార్లు మునావర్ షరీఫ్, భూమేశ్వర్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఏవో నాగరాజు తదితరులు పాల్గొన్నారు.