
అర్జీలను సత్వరం పరిష్కరించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ ఆదేశించారు. అర్జీలు పునరావృతం కాకుండా న్యాయమైన పరిష్కారం చూపాలని సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్‌తో పాటు డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, ట్రైనీ కలెక్టర్ జాహిద్ ఫర్హీన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జేసీ గీతాంజలి శర్మ మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి ఎన్నో వ్యయప్రయాసల కోర్చి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వస్తుంటారని, వారి సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఆయా సమస్యలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఆ సమస్యకు తగిన సమాధానాన్ని అర్జీదారునికి తెలపాలని స్పష్టంచేశారు. కోర్టు కేసులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమాధానం పంపుతూ పెండింగ్‌లో లేకుండా క్లోజ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 168 అర్జీలను అధికారులు స్వీకరించారు.
జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ పీజీఆర్‌ఎస్‌లో 168 అర్జీలు స్వీకరణ