
కుక్కను తప్పించబోయి..
పత్తికొండ రూరల్: పత్తికొండ–కర్నూలు రోడ్డులో అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి బుధవారం కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. సిమెంట్‌నగర్‌కు చెందిన భానుప్రకాశ్, శంకరమ్మ దంపతులు, ఇద్దరు పిల్లలు కలిసి మద్దికెరలోని మామ మనవరాలి నామకరణ మహోత్సవానికి కర్నూలు నుంచి కారులో బయల్దేరారు. పత్తికొండ సమీపంలో ప్రధాన రోడ్డుకు అడ్డంగా కుక్క రావడంతో దాన్ని తప్పించబోగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్లలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.