
ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
బొమ్మలసత్రం: నంద్యాల పట్టణానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చిన్ని కృష్ణ శుక్రవారం గడ్డిమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చిన్ని కృష్ణ గత కొంత కాలంగా బాలాజీ కాంప్లెక్స్‌లోని ఓ అద్దె ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక చిన్నచెరువు సమీపంలో గడ్డిమందు సేవించి అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు గమనించి నంద్యాల జీజీహెచ్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం శాంతిరామ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆత్మహత్యకు కుటుంబ కలహాల లేక మరేదైన కారణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
పొగాకు దగ్ధం
● రూ.10 లక్షల ఆస్తి నష్టం
పాములపాడు: ఇస్కాల గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు పొగాకు పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన గుర్రం వెంకటేశ్వర్లు 30 క్వింటాళ్లు, సోమేశ్వరుడు 10 క్వింటాళ్లు, రాము 10 క్వింటాళ్లు, బన్నూరు శివ 10 క్వింటాళ్ల చొప్పున పొగాకు పంటను తోరణాలు కూర్చి ఆరు బయట ప్రాంతంలో ఆరబెట్టారు. కాగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో 60 క్వింటాళ్ల పొగాకు పంట దిగుబడి అగ్నికి ఆహుతి అయ్యింది. గమనించిన రైతులు వ్యవసాయ బావిలో నుంచి మోటార్ల ద్వారా నీటిని చల్లినప్పటికీ పంటను కాపాడుకోలేక పోయారు. ప్రస్తుతం దిగుబడులు అంతంత మాత్రమే ఉండడం గిట్టుబాటు ధర లేకపోవడం రైతులను కృంగదీస్తుంది. ఇలాంటి తరుణంలో ఈ విపత్తుతో సుమారు పది లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించిందని రైతన్న లబోదిబోమని వాపోతున్నారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి బాధిత రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
గుండెపోటుతో గర్భిణి మృతి
ఆత్మకూరు: కొట్టాల చెరువు గ్రామానికి చెందిన గర్భిణి కుడుముల అంకమ్మ(40) గుండెపోటుతో మృతి చెందింది. బైర్లూటి సాంఘిక సంక్షేమ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో కమాటీగా పని చేస్తున్న అంకమ్మ పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో సొంతూరు కొట్టాల చెరువుకు చేరుకుంది. ప్రస్తుతం ఆమె తొమ్మిదో నెల గర్భిణి. కాగా శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త వలి, కుమారుడు దరగయ్య, కుమార్తె ధరణి ఉన్నారు. అంకమ్మ మృతి విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించి మట్టి ఖర్చులకు రూ.25 వేలు అందించారు. అంకమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం నాయకులు జవహార్‌నాయక్ ప్రభుత్వాన్ని కోరారు.
పోలీసు బదిలీలకునేడు కౌన్సెలింగ్
కర్నూలు: పోలీసు శాఖలో ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన వారికి స్థానచలనం కలగనుంది. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్‌ఐ స్థాయి సిబ్బంది ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారికి బదిలీ అయ్యే అవకాశముంది. సిబ్బంది బదిలీ కోసం శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 12 మంది ఏఎస్‌ఐలు, 24 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 118 మంది కానిస్టేబుళ్లు కలిపి మొత్తం 154 మందికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సిందిగా బదిలీ జాబితాలో పేర్లున్న వారికి డీపీఓ నుంచి ఆదేశాలు వెళ్లాయి.