
తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని మోసం
కర్నూలు: తక్కువ ధరకు బంగారం ఇప్పించి రెట్టింపు ధరకు అమ్మి పెడతానని చెప్పి మోసానికి పాల్పడిన రంగు నగేష్ అలియాస్ నాగిరెడ్డిని పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్టు చేసి కటకటాలకు పంపారు. తెలంగాణ రాష్ట్రం కేవీ రంగారెడ్డి జిల్లా విజయ నగర్ కాలనీ హయత్ నగర్లో రంగు నగేష్ నివాసం ఉండేవారు. హైదరాబాదు సరూర్ నగర్లో నివాసముంటున్న సంతోషి మాతకు మాయ మాటలు చెప్పారు. తక్కువ ధరకు బంగారం ఇప్పించి రెట్టింపు లాభం వచ్చేలా చేస్తానని నమ్మబలికి మోసం చేశాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పక్కా ఆధారాలతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా శుక్రవారం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి డీఎస్పీ వివరాలు వెల్లడించారు. రూ.60 లక్షలు డబ్బులిస్తే కేజీ బంగారం కొని రూ.30 లక్షలు లాభంతో రూ.90 లక్షలకు అమ్మిస్తానని రంగు నగేష్ నమ్మించాడు. వచ్చిన లాభంలో తనకు కొద్దిపాటి సొమ్ము ఇస్తే చాలని చెప్పాడు. దీంతో సంతోషి మాత భర్త శ్రీశైలంతో కలసి కొన్ని రోజుల క్రితం సొంత ఇంటిని అమ్మగా వచ్చిన మొత్తం డబ్బులు రూ.46 లక్షలు తీసుకున్నారు. ఈనెల 19వ తేదీన ఉదయం హైదరాబాద్ నుంచి కారులో రంగు నగేష్ కలసి కర్నూలుకు వచ్చారు. కర్నూలులోని సాయిబాబా గుడి దగ్గర వారిని దించేసి బంగారు కొనేటప్పుడు వేరే వ్యక్తులు ఉండకూడదని నమ్మించి రంగు నగేష్ కారులో కర్నూలు బస్టాండ్ చేరుకున్నాడు. అక్కడ డ్రైవర్‌కు బాడుగ డబ్బులు ఇచ్చేసి హైదరాబాద్‌కు ఉడాయించాడు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు సంతోషి మాత దంపతులు గ్రహించి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అదే రోజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడు హైదరాబాదులో ఉన్నట్లు గుర్తించి పక్కా ఆధారాలతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి రూ.45.91 లక్షలు నగదు స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు డీఎస్పీ బాబుప్రసాద్ తెలిపారు. సీఐలు నాగరాజరావు, శేషయ్యతో పాటు క్రైం పార్టీ పోలీసులు సమావేశంలో పాల్గొన్నారు.
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
రూ.45.91 లక్షల నగదు స్వాధీనం