
మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం
కాటారం: రాష్ట్రంలో మాదక ద్రవ్యాలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. కాటారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూంను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతను పెడదోవ పట్టిస్తున్న మాదకద్రవ్యాలు, బెట్టింగ్ యాప్‌ల నియంత్రణపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నివారణకు ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రజలు కూడా తమ వంతు బాధ్యత పోషించాలన్నారు. బెట్టింగ్ యాప్‌లతో అనేక మంది మోసపోయి ఆత్మహత్యలకు పాల్పడి తమ కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. బెట్టింగ్ యాప్‌లతో బలికావొద్దని పోలీస్, ఇతరాత్రా శాఖల ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మంథని నియోజకవర్గంలోని పోతారంలో ఓ వ్యక్తి బెట్టింగ్ యాప్ బారిన పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరో కుటుంబంలో జరగకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలు, బెట్టింగ్‌యాప్‌లను ఉపేక్షించబోమని, వాటిని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీసీ కెమెరాలతో నేరాలు వెంటనే శోధించొచ్చని, మంథనిలో వామన్‌రావు దంపతుల హత్య జరిగినప్పుడు సరైన ఆధారాలు లేకపోవడంతో అనేక మంది నిందితులు తప్పించుకున్నారని చెప్పారు. సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడంపై ఎస్పీ కిరణ్‌ఖరే, డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సై అభినవ్‌ను అభినందించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, ఎస్సైలు శ్రీనివాస్, మహేందర్‌కుమార్, నరేశ్, పవన్, తమాషారెడ్డి, రమేశ్, గీతారాథోడ్, తదితరులు పాల్గొన్నారు.
బెట్టింగ్ యాప్‌లను ఉపేక్షించబోం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు