
సీఈఐఆర్ పోర్టల్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
మహబూబ్‌నగర్ క్రైం: మొబైల్ ఫోన్లు చోరీకి గురైన వారితో పాటు పలు సందర్భాల్లో జారవిడుచుకున్న ప్రతి ఒక్కరి ఫోన్లు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి తిరిగి పొందే అవకాశం ఉందని ఎస్పీ డి.జానకి అన్నారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనానికి గురైన ఫోన్లతో పాటు జారవిడుచుకున్న వంద మంది బాధితుల సెల్‌ఫోన్‌లను గురువారం జిల్లా పరేడ్ మైదానంలో ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చోరీ జరిగిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం వల్ల చోరీకి గురైన ఫోన్లు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించవచ్చునని తెలిపారు. ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రగతిశీల టెక్నాలజీపై ఆధారపడిన ఒక గొప్ప సాధనమని తెలిపారు. అలాగే సైబర్ నేరాల్లో డిజిటల్ అరెస్ట్, ఓటీపీ మోసాలు, బ్యాంకింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందిని ఎస్పీ నగదు రివార్డుతో సత్కరించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాములు, సురేష్‌కుమార్, డీఎస్పీలు రమణారెడ్డి, శ్రీనివాసులు, టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్, ఎస్‌ఐ విజయ్‌భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.