
● కేబినెట్ బెర్త్‌పై వీడని ఉత్కంఠ ● ముహూర్తం ఖరారుతో న
గడ్డం వినోద్
వెడ్మ బొజ్జు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెల 3న ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. కేబినెట్ బెర్త్ ఎవరిని వరిస్తుందనే చర్చ సామాన్యుల నుంచి రాజకీయవర్గాల వరకు జరుగుతోంది. హైకమాండ్ నిర్ణయంపై ఆసక్తి పెరిగిన వేళ, నాయకులు, కార్యకర్తలు తమ ఎమ్మెల్యేకు అవకాశం వస్తుందా లేదా అనే టెన్షన్‌లో ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఖానాపూర్ నుంచి మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వీరిలో మంచిర్యాల జిల్లాకు చెందినవారే ముగ్గురు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును కూడా పరిగణనలోకి తీసుకోవాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
హైకమాండ్ జాగ్రత్తలు..
కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. పార్టీలో వ్యతిరేకత రాకుండా అభిప్రాయాలు సేకరిస్తూ, ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటోందని సమాచారం. మొదటి విస్తరణలోనే జిల్లాకు అవకాశం దక్కుతుందని భావించారు. తర్వాత ఈ ప్రక్రియ ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వచ్చింది. లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఇప్పుడు ముహూర్తం ఖరారవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ విస్తరణ ఉమ్మడి జిల్లా ప్రాతినిధ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడుతుందన్న చర్చ జిల్లాలో జరుగుతోంది.
గడ్డం వివేక్
ప్రేమ్‌సాగర్‌రావు
పోటీలో ఎవరెవరు?
బెల్లంపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గడ్డం వినోద్ తానే సీనియర్‌నని చెప్పుకుంటూ ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసి తనకు అవకాశం కల్పించాలని కోరారు. మరోవైపు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు పార్టీ కోసం కష్టపడిన తనకే పదవి రావాలని వాదిస్తున్నారు. ఒక దశలో ఆయనకు కేబినెట్ బెర్త్ ఖాయమని సంకేతాలు వచ్చాయి. తాజా పరిణామాలతో సందిగ్ధత నెలకొంది. ఆయన అనుచరులు మంత్రిపదవి కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన వర్గం ఉత్సాహంలో ఉంది. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి.. వివేక్‌ను మంత్రి వివేక్‌గారూ అని సంబోధించడం జిల్లాలో చర్చనీయాంశమైంది. మాల సామాజిక వర్గం నుంచి ఆయనకు బెర్త్ దక్కినట్లు చర్చలు ఊపందుకున్నాయి. అయితే హైకమాండ్ నుంచి ఎవరికీ స్పష్టత రాలేదు. దీంతో తుది జాబితాలో ఎవరుంటారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది.