
‘అణగారిన వర్గాలకు ఆసుపత్రులు కరువు’
బేల: అణగారిన పేద వర్గాలకు కనీసం ఆసుపత్రులు కూడా దిక్కులేవని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్, ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి అక్కడ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్వహణ అధ్వానంగా ఉండడంతో తానే స్వయంగా చీపురుతో ఊడ్చారు. అనంతరం శంషాబాద్‌లో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కోడె గోవిందు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని పెడచెవిన పెట్టాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు అన్నెల లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్ మహరాజ్ తదితరులు పాల్గొన్నారు.