
చేపల కదలికలు గమనించాలి
● జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్
మంచిర్యాలఅగ్రికల్చర్: వేసవి వాతావరణ పరిస్థితుల్లో చేపల పెంపకంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. జలాశయాల్లో నీటిమట్టం తగ్గుతోంది. మత్స్యకారుల సంఘాలు, సభ్యులు జాగ్రత్తలు వహించాలి. చెరువులు, కుంటల్లో నీటిమట్టం తగ్గితే చేపలు పట్టుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్.అవినాష్ సూచించారు. వేసవి ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు వివరించారు. జిల్లాలో అధికంగా వర్షాధార చెరవులు, కుంటలు ఉన్నాయి. చెరువుల్లోని నీటి నాణ్యత, లోతు విస్తీర్ణం, చేపల కదలికలు ప్రతీ రోజు గమనించాలి. కొన్ని చేపలను పట్టి పెరుగుదల, రంగు, తోక, రెక్కల స్వభావం ఇతర లక్షణాలు పరిశీలించాలి. తేడా ఉన్నట్లయితే మత్స్యశాఖ అధికారి సలహాలు, సూచనలు తీసుకొని నివారణ, నియంత్రణ చర్యలు చేపట్టి ఆర్థిక నష్టాన్ని తగ్గించుకోవాలి. ఉదయం సమయంలో చెరువు పైభాగంలో చేపలు నోరు తెరుచుకొని తిరుగుతుంటే ప్రాణవాయువు కొరత ఉందని గ్రహించి చెరువులో నీరు పెట్టడం, పెద్దగా పెరిగిన చేపలను పట్టి విక్రయించడం చేయాలి. తద్వారా చేపల సాంద్రత తగ్గడం వల్ల ప్రాణవాయువు కొరతను అధిగమించవచ్చు. చెరువులో నీటి నాణ్యత తగ్గినప్పుడు సున్నాన్ని ఒక హెక్టారుకు 100 నుంచి 250 కేజీల వరకు చల్లడంతో నాణ్యతతోపాటు ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. చెరువులో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేకపోతే రాత్రి సమయంలో ఆవి విడుదల చేసే కార్బన్ డై ఆకై ్సడ్ కారణంగా ప్రాణవాయువు కొరత ఏర్పడి చేపలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ సందర్భాల్లో విషం కలిపారనే అపోహలను నమ్మకుండా నిజనిర్ధారణ చేసుకోవాలి. వ్యాధితో చేపలు చనిపోయిన వెంటనే వాటిని నీటి నుంచి తొలగించి చెరువు దూరంగా కాల్చివేయడం, భూమిలో పూడ్చి వేయడం చేయాలి. వెంటనే సున్నాన్ని ఒక హెక్టారుకు 100 నుంచి 250 కేజీల మోతాదులో చల్లాలి. ఇంకా అదుపులోకి రాకుంటే నీటి నాణ్యత పెంచే రసాయనాలు బీకేసీ(బెంజాల్ కొలియం క్లోరైడ్)ను ఒక హెక్టర్‌కు ఒక లీటర్ చొప్పున నీటిలో కలిపి చెరువులో చల్లాలి. అయినప్పటికీ మార్పు లేకపోతే యాంటీ బయోటిక్ మందులు సూచించిన మోతాదులో మేతతోపాటు కలిపి ఇవ్వాలి. నీటిని మోటార్ల ద్వారా రీసైక్లింగ్ చేసుకుంటే విష వాయువులు తగ్గి ప్రాణవాయువు శాతం పెంచుతుంది.