
హైపర్ ఆది (Hyper Aadi).. బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు బాగా తెలుసు. బబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ కమెడియన్.. తనదైన పంచు డైలాగులతో బుల్లితెరతో పాటు వెండితెర ప్రేక్షకులను కూడా విపరీతంగా నవ్విస్తున్నాడు. వరుస సినిమాలతో బిజీ కావడంతో జబర్దస్త్ షోకి గ్యాప్ ఇచ్చాడు కానీ ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ షో ద్వారా మాత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఈ షో ద్వారా చాలా మంది నటీమణులను బుల్లితెరకు పరిచయం చేశాడు. సినిమాల్లో బాగా ఫేం తెచ్చుకున్న ఆర్టిస్టులను తీసుకొచ్చి.. ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ ద్వారా బుల్లితెరకు పరిచయం చేస్తుంటాడు. షోని రక్తికట్టించేందుకు వారితో ‘పులిహోర’ కూడా కలుపుతుంటాడు. అందుకే ఆదిపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తుంటాయి. పలాన నటితో ప్రేమలో ఉన్నాడని..పెళ్లి చేసుకోబోతున్నాడని నిత్యం ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది.
తాజాగా ‘జనతా గ్యారేజ్’ఫేం దీపు నాయుడు(Deepu Naidu)తో ఆది ప్రేమలో పడినట్లు రూమర్స్ వచ్చాయి. వీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే టాక్ వినిపించింది. తాజాగా ఈ రూమర్స్‌పై నటి దీపు నాయుడు స్పందించింది. హైపర్ ఆది తనకు మంచి స్నేహితుడని, సరదాగా తనను ఫ్లర్ట్ చేస్తాడు కానీ మా మధ్య ఏలాంటి రిలేషన్ లేదని స్పష్టం చేసింది.
‘హైపర్ ఆది ప్రొఫిషినల్‌గానే నాకు పరిచయం అయ్యాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ’లో ఆయనతో కలిసి స్కిట్ చేశా. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. నన్ను ఎప్పుడూ ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాడు. నాతో రీల్స్ చేస్తుంటాడు. ‘నేను ఏ అమ్మాయి కోసం వీడియోలు చేయలేదు. నీ కోసం చేస్తున్నాను’, ‘ఒక అందమైన అమ్మాయి ఉంది చూపించనా’ అంటూ వీడియో తీస్తూ ఫ్లర్ట్ చేస్తుంటాడు. మొదట్లో నాకు పెద్దగా నచ్చకపోయేది కానీ, క్లోజ్ నెస్ పెరిగిన తర్వాత అదంతా లైట్ తీసుకున్నా. ఇప్పుడు నాకు ఆది మంచి ఫ్రెండ్’ అని దీపు నాయుడు చెప్పుకొచ్చింది.
ఇక బిగ్‌బాస్ షో గురించి మాట్లాడుతూ.. ‘సీజన్ 3లో నాకు చాన్స్ వచ్చింది కానీ వెళ్లలేదు. ఆఫర్ వచ్చిన విషయం అమ్మకు చెబితే..‘నువ్వు ఆ గొడవలు పడలేవు’ అని చెప్పింది. అందుకే నేను నో చెప్పాను. కానీ కొన్నాళ్ల తర్వాత అనవసరంగా మంచి చాన్స్ మిస్ చేసుకున్నానే’అని అనిపించింది. ఇప్పుడు అవకాశం వస్తే..కచ్చితంగా ‘బిగ్‌బాస్’లోకి వెళ్తాను’ అని చెప్పింది.
కేరాఫ్ గోదావరి చిత్రంలో ఇండస్ట్రీ ఏంట్రీ ఇచ్చిన దీపు అలియాస్ దేదిత్య నాయుడు. జనతా గ్యారేజ్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంది. నక్షత్రంతో పాటు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ప్రస్తుతం టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తోంది.