
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 26 మంది అసువులు బాశారు. వారిలో నెల్లూరుకు చెందిన మధుసూధనరావు ఒకరు. ఓ ఈవెంట్ కోసం నెల్లూరు వెళ్లిన హీరోయిన్ అనన్య నాగళ్ల.. మధుసూధనరావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించింది. అతడి భౌతికకాయానికి నివాళులు అర్పించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
తీవ్రంగా ఖండించాలి
పహల్గామ్ సంఘటన నాకెంతో బాధ కలిగించింది. నేను ఒక ఈవెంట్ కోసం నెల్లూరుకి వచ్చాను. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలుసుకొని చూసేందుకు వచ్చాను. మతం పేరు తెలుసుకుని మరీ చంపేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. శ్రీ మధుసూదనరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. భారత యువతగా మనం ఇలాంటి ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాలి.
సోషల్ మీడియాలో సంతాపాలు..
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అని అనన్య (Ananya Nagalla) ట్వీట్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉగ్రదాడిలో మరణించినవారికోసం సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు తప్పితే ఏ ఒక్కరూ వారి ఇంటికెళ్లి కుటుంబాలను పరామర్శించలేదు.
మీరే నిజమైన హీరోయిన్
కానీ మీరు మాత్రం నేరుగా బాధితుడి ఇంటికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. మీరు నిజమైన హీరోయిన్ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా అనన్య నాగళ్ల గతంలోనూ తన మంచి మనసు చాటుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు ప్రభుత్వానికి విరాళాలు అందించి ప్రశంసలు అందుకుంది.
తెలుగమ్మాయి సినీ కెరీర్
అనన్య నాగళ్ల తెలుగమ్మాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి తన స్వగ్రామం. నటనపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి షార్ట్ ఫిలింస్‌లో నటించింది. షాదీ అనే లఘు చిత్రం తనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. 2019లో మల్లేశం సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మళ్లీ పెళ్లి, తంత్ర, పొట్టేల్, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి పలు చిత్రాలతో అలరించింది. బహిష్కరణ అనే వెబ్ సిరీస్ కూడా చేసింది.
పహల్గామ్ సంఘటన నాకెంతో బాధను కలిగించింది. ఈ రోజు నేను ఒక ఈవెంట్ కోసం నెల్లూరుకి వచ్చాను… ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలుసుకొని చూసేందుకు వచ్చాను… మతం పేరు తెలుసుకుని మరి చంపేయడాన్ని నేను తిసుకోలేకపోతున్నాను..
శ్రీ మధుసూదనరావు గారి ఆత్మకు శాంతి… pic.twitter.com/q2ZuMj2G8M— Ananya Nagalla (@AnanyaNagalla) April 24, 2025
చదవండి: పాక్ నటుడికి బాలీవుడ్ బ్యూటీ సపోర్ట్.. వారిపై బ్యాన్ కరెక్ట్ కాదు