
ఆత్మవిశ్వాసంతో దేన్నయినా సాధించవచ్చని నిరూపించింది భరతనాట్య నృత్యకారిణి సుధాచంద్రన్. రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయిన ఆమె కృతిమ కాలుతో నాట్యాన్ని కొనసాగించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. బుల్లితెరపై నటిగానూ కొనసాగుతున్న ఆమె తాజాగా తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను పంచుకుంది.
16 ఏళ్ల వయసులో..
సుధాచంద్రన్ (Sudha Chandran) మాట్లాడుతూ.. పదహారేళ్ల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నా కాలిని కోల్పోయాను. తమిళనాడులో మా కులదైవాన్ని దర్శించుకుని చెన్నై వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. నన్ను మొదటగా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. నా ఆరోగ్యం దిగజారుతుండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. అందరూ ఎంతో ప్రయత్నించారు, కానీ తలరాతను ఎవరూ మార్చలేరు కదా.. కాలు తీసేయకపోతే అది ప్రమాదకరంగా మారి ప్రాణాలే పోవచ్చన్నారు.
జీవితాంతం భారమేగా
మా నాన్న నాకు ఈ విషయం చెప్పినప్పుడు నేను బతికుండి ఏం ప్రయోజనం? జీవితాంతం మీకు భారంగా మిగిలిపోవడం తప్ప! అని బాధపడ్డాను. మళ్లీ జీవితంలో నేను సక్సెస్ చూసేవరకు నా వెన్నంటే ఉంటానని నాన్న నాకు ధైర్యం చెప్పాడు. అలా నా కాలు తీసేశారు. మా నాన్న నా విజయం చూశారు. మూడేళ్ల క్రితమే ఆయన చనిపోయారు. అమ్మానాన్న నాకెంతో సేవ చేశారు. వాళ్లకు నేనేమీ తిరిగివ్వలేకపోయాను అని సుధా చంద్రన్ ఎమోషనలైంది.
సినిమా ఇండస్ట్రీకి అనర్హురాలివి!
మయూరి సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇండస్ట్రీలో ఎదురైన ఇబ్బందుల గురించి మాట్లాడుతూ.. మయూరి సినిమా రిలీజయ్యాక ఇది నీ కథ కాబట్టి బాగా నటించావు. అదే వేరే సినిమా అయ్యుంటే నువ్వు చేయలేవు, నీ వల్ల కాదన్నారు. వారి మాటలతో ఇంకా సీరియస్‌గా అవకాశాల కోసం ప్రయత్నించా.. సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో సీరియల్స్‌లో ట్రై చేశాను. ఒక హిందీ డైరెక్టర్ అయితే నేను ఈ ఇండస్ట్రీకే అనర్హురాలిని అని ముద్ర వేశాడు. కట్ చేస్తే అదే వ్యక్తి చేతులమీదుగా ఓ సీరియల్‌కుగానూ ఉత్తమ విలన్‌గా అవార్డు అందుకున్నాను అని చెప్పుకొచ్చింది. సుధా చంద్రన్ చివరగా విసితిరన్ (2022) అనే తమిళ సినిమాలో కనిపించింది.
చదవండి: రూ.3 కోట్ల ఆఫర్.. అక్కర్లేదని రిజెక్ట్ చేశాం: శివబాలాజీ దంపతులు