
‘‘షూటింగ్‌కి వెళ్లి కెమేరా ముందు నిల్చున్న ప్రతిసారీ నాకు వణుకు వస్తుంటుంది. అలాగే మీ ముందు (ఫ్యాన్స్) మాట్లాడాలన్నా... (నవ్వుతూ). ఒక నటుడికి వినోదం పండించడం అనేది చాలా కష్టం. అందుకే నేను ‘అదుర్స్ 2’ చేయడానికి కాస్త భయపడుతున్నాను. మళ్లీ జీవితంలో అలాంటి కామెడీ మూవీ వస్తుందో లేదో’’ అని హీరో ఎన్టీఆర్(Jr NTR) అన్నారు.
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square). కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్, ‘సత్యం’ రాజేశ్, కార్తికేయ, విష్ణు, ప్రియాంకా జవాల్కర్, రెబ్బా మోనికా జాన్ (స్పెషల్ సాంగ్) ఇతర పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలైంది.
శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్‌మీట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘అభిమాన సోదరులకు పేరు పేరునా కృతజ్ఞతలు. చాలా కాలమైంది మనం కలుసుకుని. నవ్వించడం అనేది చాలా గొప్ప వరం. ఎన్ని బాధలు, కష్టాలు ఉన్నా మనల్ని నవ్వించే మనిషి ఉంటే చాలు కదా అనిపిస్తుంది. ఈ రోజు దర్శకుడు కల్యాణ్ శంకర్ మనకి దొరికాడు. ‘మ్యాడ్ స్క్వేర్’తో మళ్లీ సక్సెస్ కొట్టిన కల్యాణ్‌కి అభినందనలు. ఓ బ్లాక్‌బస్టర్ మూవీ సీక్వెల్‌తో జనాలని రంజింపచేయడం చాలా కష్టం. కానీ మీరు సాధించారు. ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్.
ఈ మూవీలో మురళీధర్‌గారు అద్భుతంగా నటించారు. లడ్డు పాత్ర చేసిన విష్ణు లేకుంటే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కాదేమో? అనిపించింది. డైరెక్టర్ శోభన్‌గారి అబ్బాయిలు సంతోష్, సంగీత్‌లను చూస్తే ఆయన గుర్తొస్తారు. మనకి బాగా ఇష్టమైన వాళ్లు మనకి దూరమైనా మన చుట్టూనే ఉంటారు. మీ నాన్నగారు కూడా గర్వపడుతుంటారు. ‘మ్యాడ్’లో రామ్ నితిన్‌ని చూస్తే నేను యంగ్‌గా ఉన్నప్పుడు ఎలా ఉన్నానో అలానే ఉన్నారు.
నాకు 2011లో పెళ్లయింది. నార్నే నితిన్ అప్పుడు చాలా చిన్నపిల్లాడు. నాతో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. కానీ, ధైర్యం చేసి నా వద్దకు వచ్చి నాతో చెప్పిన ఒకే ఒక్క మాట ‘బావా... నేను యాక్టర్ అవుతాను’ అని.. అంతే ధైర్యంగా నేను ‘నా సపోర్ట్ నీకు ఉండదు... పోయి చావ్ అన్నాను’. కానీ, ఇండస్ట్రీలో తన కెరీర్ ఎలా ఉండబోతోంది? అనే భయం ఉండేది. నీకు నువ్వుగా ముందుకెళ్లు అన్నాను. తనే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లాడు. ఈ రోజు తనని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. సునీల్ లేకపోతే ‘మ్యాడ్ స్క్వేర్’ లేదు. సంగీత దర్శకుడు భీమ్స్, రచయిత కాసర్ల శ్యామ్‌తో పాటు ఈ సినిమాకి పని చేసిన అందరికీ అభినందనలు. వీళ్లందరి వెనకాల కనపడని ఓ శక్తే మా చినబాబు. త్వరలోనే మేం ఓ సినిమా చేయబోతున్నాం. ఇక ‘దేవర’ చిత్రాన్ని ఆదరించినందుకు, మీ (ఫ్యాన్స్) భుజాలపైన మోసినందుకు ధన్యవాదాలు.
‘దేవర 2’ (Devara 2) కచ్చితంగా ఉంటుంది. కాకపోతే మధ్యలో ప్రశాంత్ నీల్‌గారు వచ్చారు. నేను ఫ్యాన్స్ కోసమే కష్టపడుతుంటాను. మిమ్మల్ని ఆనందపరచడానికే బతికుంటాను. మీరెప్పుడూ కాలర్ ఎత్తుకునేలాగే ప్రయత్నిస్తాను.. అప్పుడప్పుడు కుదరకపోయినా పర్లేదు.. కానీ మీకోసం కష్టపడుతూనే ఉంటాను’’ అన్నారు.
డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా నటీనటులకు, సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్. నేను వచ్చినప్పటి నుంచి ‘జై ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్’ అనే స్లోగన్స్ చూస్తుంటే... జేఏఐఎన్‌టి... జెయింట్ గుర్తొస్తోంది. సో.. ఎన్టీఆర్ జెయింట్’’ అన్నారు. ఈ వేడుకలో ‘మ్యాడ్ స్క్వేర్’ నటీనటులు, సాంకేతిక నిపుణులు, పంపిణీదారులకు షీల్డ్‌లు ప్రదానం చేశారు.