
'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్‌కు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూ.ఎన్టీఆర్ వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మ్యాడ్ గ్యాంగ్ (నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ )తో తారక్ అల్లరి ఎలా ఉంటుందో మరికొన్ని గంటల్లో చూడొచ్చు. 2023లో వచ్చిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా 'మ్యాడ్ స్క్వేర్' చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించారు. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగవంశీ సమర్పకులుగా ఉన్నారు.
మార్చి 28న విడుదలైన 'మ్యాడ్ స్క్వేర్' కేవలం ఐదురోజుల్లోనే రూ. 74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వారంలోపే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటేసి లాభాల బాట పట్టింది. దీంతో అభిమానుల కోసం సక్సెస్ మీట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వస్తుండటంతో అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. తన బావమరిది నార్నె నితిన్ 'మ్యాడ్ స్క్వేర్'తో వరుసగా హ్యాట్రిక్ కొట్టడంతో ఆయన ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తారో చూడాలి.

ఏప్రిల్ 4న హైదరాబాద్‌లోని శిల్పా కళా వేదికలో 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్ జరిపేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయింత్రం 6గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎన్టీఆర్ రాత్రి 8గంటలకు అక్కడికి చేరుకోవచ్చని తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో చిత్ర నిర్మాత నాగవంశీకి మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. గతంలో 'మ్యాడ్' ట్రైలర్‌ను రిలీజ్ చేసిన తారక్ ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్' సక్సెస్ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిగా వస్తున్నారు.