
బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడి కన్నడ నటి రన్యారావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించారు. ప్రస్తుతం జైల్లో ఉంటున్న రన్యారావుకు ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. గతంలో ఆమె బెయిల్ పిటిషన్ వేయగా.. బెంగళూరు ఆర్థిక నేరాల కోర్టు (Court for Economic Offences) తిరస్కరించింది.
అయితే ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బంగారం స్మగ్లింగ్ కేసులో బెయిల్ ఆమెకు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రన్యా రావుపై విదేశీ మారకద్రవ్యం, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం-1974((COFEPOSA)) కూడా ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సిఫార్సు మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నోడల్ ఏజెన్సీ అయిన సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (CEIB) ఈ చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టం ప్రకారమైతే దాదాపు ఏడాది పాటు బెయిల్ వచ్చే అవకాశం లేదు. నిందితుడు దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదని తేలితే ఈ చట్టం ప్రయోగిస్తారని సమాచారం. ఈ కేసులో రన్యా రావు పదేపదే బెయిల్ కోసం ప్రయత్నించిన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ఈ చర్య తీసుకున్నట్లు వర్గాలు వెల్లడించాయి. ఆమెతో పాటు ఇతర నిందితులు తరుణ్ రాజు, సాహిల్ సకారియా జైన్‌లపై కూడా ఈ చట్టం కింద కేసు నమోదు చేశారు.
కాగా.. రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా సీనియర్ పోలీసు అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె రన్యారావును మార్చి 3న అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రన్యారావుతో పాటు మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసును డీఆర్‌ఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్నాయి. డీజీపీ రామచంద్రరావు పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మూడో నిందితుడైన జైన్‌తో కలిసి నటి హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు డీఆర్‌ఐ దర్యాప్తులో తేలింది.