
మోహన్ లాల్ సినిమాలకు టాలీవుడ్‌లోనూ మంచి ఆదరణ ఉంది. ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ మధ్య ఎల్2: ఎంపురాన్‌తో మంచి హిట్ అందుకున్న మోహన్ లాల్..ఇప్పుడు ‘తుడరుమ్’(Thudarum Movie Review) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 15 ఏళ్ల తర్వాత నటి శోభన మరోసారి మోహన్‌లాల్‌కు జోడీగా నటించింది. నిన్న(ఏప్రిల్ 25) మలయాళంలో విడుదలై మంచి టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 26) అదే పేరుతో తెలుగులో రిలీజైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
షణ్ముగం అలియాస్ బెంజ్(మోహన్ లాల్) ఒకప్పుడు తమిళ సినిమాలకు యాక్షన్ డూప్‌గా నటించేవాడు. ఓ యాక్సిడెంట్ కారణంగా సినిమాలను వదిలిపెట్టి తన మాస్టర్ (భారతీ రాజా) కొనిచ్చిన కారుతో కేరళలో సెటిల్ అవుతాడు. భార్య లలిత(శోభన), పిల్లలు(కొడుకు, కూతురు)..వీళ్లే అతని ప్రపంచం. టాక్సీ నడుపుతూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఓ సారి అనుకోకుండా తను ఎంతో అపురూపంగా చూసుకునే అంబాసిడర్ కారును పోలీసులు తీసుకెళ్తారు. ఆ కారును తిరిగి ఇంటికి తెచ్చుకునేందుకు బెంజ్ చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు.
అదే సమయంలో ఇంజనీరింగ్ చదివే తన కొడుకు పవన్ కనిపించకుండాపోతాడు. పవన్‌కి ఏమైంది? బెంజ్ కారును పోలీసులు ఎందుకు జప్తు చేశారు? పోలీసులు సీజ్ చేసిన కారును తిరిగి తెచ్చుకునే క్రమంలో బెంజ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? ఎలాంటి తప్ప చేయని బెంజ్‌ని సీఐ జార్జ్(ప్రకాశ్ వర్మ) హత్య కేసులో ఎందుకు ఇరికించాడు? అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు? అతన్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? తన ఫ్యామిలి అన్యాయం చేసినవారిపై బెంజ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే మిగతా కథ(Thudarum Movie Review).
ఎలా ఉందంటే..
పరువు హత్యల నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. తుడరుమ్ కూడా అలాంటి కథే. కోర్ పాయింట్ అదే అయినా.. దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు, ఈ కథకు ఇచ్చిన ట్రీట్‌మెంట్ కొత్తగా ఉంటుంది. దర్శకుడు తరుణ్ మూర్తి ఈ కథను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రారంభించి.. రివేంజ్ డ్రామాగా ఎండ్ చేశారు. మాస్ ఇమేజ్ ఉన్న మోహన్‌లాల్‌ని సింపుల్‌గా పరిచయం చేయడమే కాదు.. ఫస్టాఫ్ మొత్తం అంతే సింపుల్‌గా చూపించారు. హీరోకి భార్య, పిల్లలే ప్రపంచం అని తెలియజేయడం కోసం ప్రతి విషయాన్ని డీటేయిల్డ్‌గా చెప్పడంతో ఫస్టాఫ్ సాగినట్లుగా అనిపిస్తుంది.
ఇంటర్వెల్ ముందు వరకు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగిన ఈ చిత్రం ఇంటర్వెల్ సీన్‌తో క్రైమ్ జానర్‌లోకి వెళ్తుంది. హిరో అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం.. అక్కడ ఓ ట్విస్ట్ రివీల్ అవ్వడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం రివేంజ్ యాక్షన్ డ్రామాగా సాగుతుంది. ఇక్కడే కథనం కాస్త గాడి తప్పినట్లు అనిపిస్తుంది. తన ఫ్యామిలీని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునే హీరో.. పోలీసులు తన కుటుంబం వేసిన నిందను పోగొట్టడానికి ప్రయత్నించకుండా..పగను తీర్చుకోవడానికి వెళ్లడం ఎందుకో పొసగలేదు అనిపిస్తుంది. ‘దృశ్యం’ ఛాయలు కపించకూడదనే దర్శకుడు కథను ఇలా మలిచాడేమో కానీ.. సినిమా చూస్తున్నంత సేపు ఆ చిత్రం గుర్తొస్తూనే ఉంటుంది.
అలాగే ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత కథనం మళ్లీ సాగినట్లుగానే అనిపిస్తుంది. ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నప్పటికీ దర్శకుడు ఎలివేషన్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. దీంతో ప్రేక్షకుడు ఎమోషనల్ సీన్లకు పూర్తిగా కనెక్ట్ కాలేకపోయాడు. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించలేదు కానీ.. ముగింపు చూస్తే ఆ విషయం ఈజీగా అర్థమైపోతుంది.
ఎవరెలా చేశారంటే..
మోహన్ లాల్ ఎప్పటిలాగే మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన టాక్సీడ్రైవర్ బెంజ్ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లను ఇరగదీశాడు. బాత్రూంలో కూర్చొని ఏడిచే సీన్ హైలెట్. ఇక మోహన్ లాల్ తర్వాత బాగా పండిన పాత్ర ప్రకాశ్ వర్మది . మంచితనం ముసుగు వేసుకొని క్రూరంగా ప్రవర్తించే సిఐ జార్జ్ అనే పాత్రలో ఆయన జీవించేశాడు. చాలా ఏళ్ల తర్వాత మోహన్‌లాల్‌తో తెర పంచుకున్న శోభనకు మంచి పాత్రే లభించింది.
నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో చక్కడా నటించింది. బిను పప్పు, థామస్ మాథ్యూతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జేక్స్‌బిజోయ్ తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలం. నైట్ షాట్స్‌ని అద్భుతంగా చిత్రీకరించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్