
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో (Retro Movie). ఇటీవల ఈ సినిమా ఈవెంట్‌లో అతడి తండ్రి శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీశాయి. తమిళ చిత్రపరిశ్రమలో సిక్స్ ప్యాక్ ట్రెండ్‌ను ప్రవేశపెట్టింది నా కొడుకే అని ఆయన సగర్వంగా చెప్పుకున్నాడు. అంతటితో ఆగకుండా సూర్య కంటే ముందు ఎవరైనా సిక్స్ ప్యాక్‌తో రావడం చూశారా? అని ఓ ఈవెంట్‌లో ప్రశ్నించాడు.
సిక్స్ ప్యాక్ ట్రెండ్
ఇది విన్న సినీప్రియులు.. అదేంటి? కోలీవుడ్‌లో అంతకుముందే విశాల్ (Vishal) సిక్స్ ప్యాక్‌తో వచ్చాడుగా అని కామెంట్లు చేస్తున్నారు. అసలు సిక్స్‌ప్యాక్ ట్రెండ్‌కు కోలీవుడ్‌లో నాంది పలికింది ఎవరన్న ప్రశ్నకు తాజాగా విశాల్ స్పందించాడు. మొదట్టమొదటిసారి ధనుష్ పొల్లాధవన్ మూవీలో సిక్స్ ప్యాక్‌తో కనిపించాడు. తర్వాత నేను సత్యం, మదగజరాజ సినిమాల్లో సిక్స్ ప్యాక్ చూపించాను. జనాలు ఇవన్నీ మర్చిపోయారనుకుంటాను అని చెప్పుకొచ్చాడు.
మర్చిపోయారా?
వెట్రిమారన్ దర్శకత్వం వహించిన 'పొల్లాధవన్' 2007లో రిలీజైంది. ఇందులో ధనుష్ సిక్స్ ప్యాక్‌తో కనిపించాడు. తర్వాత విశాల్ 'సత్యం' సినిమాలో ఆరుఫలకల దేహంతో కనిపించాడు. ఈ మూవీ 2008 ఆగస్టులో విడుదలైంది. అనంతరం సూర్య.. 2008 నవంబర్‌లో వచ్చిన 'వారణం ఆయిరం' (సూర్య సన్నాఫ్ కృష్ణన్) సినిమాలో తొలిసారి సిక్స్‌ప్యాక్ ట్రై చేశాడు. ఇక రెట్రో విషయానికి వస్తే.. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా యాక్ట్ చేసింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మే 1 న విడుదల కానుంది.