
నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'అఖండ2'లో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి(Vijayashanti ) నటిస్తున్నారనే వార్తలు సోషల్‌మీడియాతో పాటు ప్రధాన మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అందులో ఆమె నటిస్తే సినిమాకు మరింత బజ్ క్రియేట్ అవుతుందని మేకర్స్ కూడా ప్లాన్ చేశారని టాక్ వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఆమె రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా కల్యాణ్‌రామ్‌తో అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో దుమ్మురేపారు. దీంతో ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అవుతారేమోనని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ బాలకృష్ణ( Nandamuri Balakrishna), చిరంజీవిలతో సినిమాలు చేస్తారని అభిమానులు భావించారు. అయితే, విజయశాంతి ఆలోచనలను భట్టి చూస్తే జరిగే పని కాదని చెప్పవచ్చు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ అంశం గురించి ఆమె మాట్లాడారు.
తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో విజయశాంతికి ఇలా ఒక ప్రశ్న ఎదురైంది. 'చిరంజీవితో 19, బాలకృష్ణతో 17 సినిమాలు చేశావట కదా.. మళ్లీ వారితో చేస్తావా..? ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. చెరో సినిమా చేశాక మంత్రివైపోయి ఆ బిజీలో తిరుగు' అనే ప్రశ్నకు ఒక సెకను కూడా ఆలోచించకుండా విజయశాంతి సమాధానం ఇచ్చారు. 'నటించే చాన్స్ లేదు, ఎమ్మెల్సీగానే టైమ్ సరిపోదు… పనిచేయాలి కదా.. అసలు కుదరదు' అని చెప్పారు. ఆ ప్రశ్నే పూర్తిగా అసంబద్ధం అనిపించేలా విజయశాంతి సమాధానం ఇచ్చారు.

విజయశాంతికి టైమ్ ఉన్నా కూడా చిరంజీవి(Chiranjeevi )తో సినిమా చేయదని సోషల్‌మీడియాలో కొందరు చెప్పుకొస్తున్నారు. గతంలో ఒక సినిమాకు సంబంధించి వారిద్దరి మధ్య కాస్త దూరం పెరిగిందని గుర్తుచేస్తున్నారు. అయితే, చిరంజీవి, బాలకృష్ణ కూడా విజయశాంతితో నటించడానిక ఇష్టపడకపోవచ్చు. దానికి ప్రధాన కారణం గతంలో వారికి సమానంగా స్టేటస్‌ను ఆమె అనుభవించారు. ఇప్పుడు వారి సినిమాల్లో ఆమెకు పాత్ర ఇవ్వాలంటే సమానమైన రోల్ ఇవ్వాలి. అందుకు వారిద్దరూ ఒప్పుకోరు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో మరో పాత్ర ప్రధానంగా హైలెట్ అవడం చాలా తక్కువని చెప్పవచ్చు. వారిద్దరి కంటే ప్రాముఖ్యత తక్కువగా ఉన్న రోల్ విజయశాంతికి ఇస్తే ఎట్టిపరిస్థితిల్లోనూ ఒప్పుకోరు. అందుకే ఈ కాంబినేషన్‌ను సెట్ చేయడం అంత సులభం కాదని నెటిజన్ల అభిప్రాయం.

ఇప్పటి తరం యూత్‌కు అంతగా విజయశాంతి ఇమేజ్ గురించి తెలియకపోవచ్చు. ఒకప్పుడు హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో ఆమెకు కూడా అంతే స్థాయిలో ఇమేజ్ ఉండేది. అలాంటి స్టేటస్‌ను ఆమె అనుభవించారు. అందుకే రీసెంట్‌గా జరిగిన సినిమా వేడుకలో ఎన్టీఆర్‌తో పాటు కల్యాణ్‌రామ్ ఆమె పట్ల చాలా గౌరవంగానే మెలిగారు. కర్తవ్యం సినిమాకు ఉత్తమ జాతీయ నటిగా అవార్డ్ అందుకోవడంతో పాటు 4 నంది, 6 ఫిలింఫేర్ అవార్డ్స్‌ను అందుకున్నారు. 1989లోనే ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి సత్తా చాటడమే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాషల్లో మెప్పించారు. సుమారు 200 సినిమాల్లో ఆమె నటించారు. బాలయ్య, చిరుతో సహా ఆ నంబర్స్‌కు దగ్గర్లో లేరు.