
రైతులను పట్టించుకోని మంత్రులు
నల్లగొండ టూటౌన్: మంత్రులు గాలి మోటార్లలో వస్తూపోతూ గాలి మాటలు మాట్లాడుతున్నారే తప్ప జిల్లా రైతులను పట్టించుకోవడం లేదని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆరోపించారు. గురువారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆట్లాడారు. ఇద్దరు మంత్రులు ఉన్నా కూడా వారు ఏనాడూ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించలేదన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముందు చూపు లేకపోవడం వల్ల రైతులు మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో సన్న ధాన్యం మిల్లులకు అమ్ముకుంటే నేడు దొడ్డు ధాన్యం కూడా రైతులు మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయమై కలెక్టర్‌తో మాట్లాడదామని ఫోన్ చేస్తే ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎత్తడం లేదన్నారు. మంత్రి వస్తే ఆయన వెంటే కలెక్టర్ తిరుగుతూ, కాంగ్రెస్ నేతలకు పనిచేస్తుంది తప్ప రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టడం లేదన్నారు. కలెక్టర్ అందుబాటులో ఉంటూ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించాలన్నారు. లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరుచుకోలేదని, సివిల్ సప్లయ్ మంత్రి ఏమి చేస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
13న సన్నాహక సమావేశం
ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు జిల్లా నుంచి 3 వేల మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లాలని నిర్ణయించామన్నారు. అందుకు సంబంధించి ఈ నెల 13న లక్ష్మీగార్డెన్స్‌లో నల్లగొండ నియోజక వర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా వరంగల్ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో కటికం సత్తయ్యగౌడ్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, బొర్ర సుధాకర్, సహదేవరెడ్డి, జి.వెంకటేశ్వర్లు, తండు సైదులుగౌడ్, కరీంపాషా, సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి