
ఆలూరు: దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో పాత మిద్దెను పడగొట్టి మట్టి తరలిస్తుండగా పురాతన ఇనుప బీరువా బయట పడింది. అందులో గుప్తనిధులు లభించినట్లు ప్రచారం జరగడంతో పోలీసులు పరిశీలించారు. వివరాల్లోకి వెళితే.. చాకలి నరసింహప్ప అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన నరసింహరెడ్డి వద్ద పాతమట్టి మిద్దెను కొనుగోలు చేశాడు. దీనిని కొత్తగా నిర్మించుకునేందుకు పడగొట్టాడు.
మంగళవారం కూలీలతో మిద్దె మట్టి తరలిస్తుండగా పాత ఇనుప బీరువా కనిపించింది. దానికి తాళం వేసి ఉంది. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి పోలీసులు, రెవెన్యూ అధికారులకు చేరింది. గ్రామానికి చేరుకుని కట్టర్ సాయంతో బీరువాను పగలగొట్టి చూడగా అందులో 1942 నాటి ఇత్తడి అణ నాణెం, ఆస్తులకు సంబంధించిన పాత డాక్యుమెంట్ పత్రాలు లభించాయని ఎస్‌ఐ భూ పాలుడు వెల్లడించారు. ఇంటి పాత యజమానిని అడగగా ఆ బీరువా తనది కాదని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు.